Saturday, May 3, 2025
Homeరాష్ట్రీయం28 మండలాల్లో భూభారతి

28 మండలాల్లో భూభారతి

– ఈ నెల 5 నుంచి అమలు
– పైలట్‌ మండలాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తి
– భూ సమస్యలపై 11, 630 దరఖాస్తుల స్వీకరణ
– ప్రాధాన్యతా క్రమంలో జూన్‌ 2లోగా పరిష్కారం
– ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మార్పులకు ఆవకాశం
– ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నిర్ణయం మార్పునకు నాంది : మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని 28 మండలాల్లో కొత్తగా ఈ నెల 5నుంచి భూ భారతి చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల అంబేద్కర్‌ జయంతి రోజు ప్రారంభించిన ఈ చట్టాన్ని రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసింది. ఆయా మండలాల్లోని 72 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో భూ సమస్యలపై 11,630 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో న్యాయపరమైన వివాదాలను పక్కన పెట్టి మిగతా వాటిని జూన్‌ 2 నాటికి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నారు. అక్కడి ఫలితాలను అంచనా వేసిన సర్కార్‌ ఇప్పుడే రాష్ట్రమంతటా అమలు చేయకూడదని నిర్ణయించినట్టు సమాచారం. తాజాగా ఎంపిక చేసిన మండలాల్లో అమలు చేసి, అక్కడి నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మార్పులకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా గత నెల 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంగా భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఆటంకం కలగకుండా పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణ్‌పేట్‌ జిల్లా మద్దూర్‌, ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలాల్లో పూర్తి స్ధాయిలో అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతిరోజు మండలంలోని రెండు గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహించారు. నాలుగు పైలట్‌ మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్‌ 17నుంచి 30వరకు సదస్సులను పూర్తిచేశారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఆయా మండలాల్లో భూసమస్యలపై దరఖా స్తులను స్వీకరించారు. లింగంపేటలో 3,702, వెంకటాపూర్‌లో 3,969, మద్దూర్‌లో 1,341, నేలకొండపల్లిలో 2,618 మొత్తం 11, 630 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పీపీబీకి సంబంధించి 3,446, సాదాబైనామాలపై 2,796 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఏ రోజుకారోజు కంప్యూటర్‌లో నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపించారు. హైదరాబాద్‌ మినహా 605 మండలాలకు గాను 555 మండలాల్లో సదస్సులను ప్రభుత్వం పూర్తి చేసింది.
మార్పునకు నాంది : మంత్రి పొంగులేటి
భూభారతి చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలకబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ భారతి చట్టానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. తాను ఏప్రిల్‌ 17నుంచి 30వరకు 20 జిల్లాల్లో 45 సదస్సుల్లో పాల్గొన్నానని చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన కనిపించిందని పేర్కొన్నారు. ఇక నుంచి రైతులు ఏ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భూ భారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి చెప్పారు.

జూన్‌ నుంచి అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌
రెండో విడతలో ఈ నెల 12 నుంచి మరో 25 చోట్ల అమలు : రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జూన్‌ నుంచి రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ అమలు చేయబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత నెల 10నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేశామనీ, రెండో విడతగా ఈనెల 12 నుంచి మరో 25 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అమలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30నాటికి 22 కార్యాలయాల్లో సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసినట్టు వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగంపై సమీక్ష నిర్వహించారు. స్లాట్‌ బుకింగ్‌ విధానానికి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి పోస్ట్‌కార్డు ద్వారా అభిప్రాయాలను సేకరించగా, 94 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారని మంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఆధార్‌-ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ జ్యోతి బుద్దప్రకాష్‌, సీసీఎల్‌ఎ సెక్రెటరీ మకరంద్‌, మీసేవ డైరెక్టర్‌ రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.
రెండవ దశలో…..
రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్‌ నగర్‌, షాద్‌నగర్‌, మహేశ్వరం, వనస్థలిపురం, శేర్‌లింగంపల్లి, మేడ్చల్‌ మల్కాజిగిరి, ఉప్పల్‌, ఘట్‌కేసర్‌, నారపల్లి, మల్కాజ్‌గిరి, జనగాం, ఘన్‌పూర్‌, నర్సంపేట, బీబీనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల్‌, గజ్వేల్‌, సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, రంగారెడ్డి వరంగల్‌ , హైదరాబాద్‌, హైదరాబాద్‌ సౌత్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రెండో దశలో స్లాట్‌ బుకింగ్‌ అమలు చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img