Friday, May 2, 2025
Homeతాజా వార్తలుఅసమానతల్లేనిసమాజం కోసం పోరాడుదాం

అసమానతల్లేనిసమాజం కోసం పోరాడుదాం

– సోషలిస్టు వ్యవస్థతోనే సమస్యలకు పరిష్కారం
– బీజేపీ విధానాలతో పేదల బతుకులు మరింత భారం
– పని దినాలపై కేంద్రం కుట్రలు తిప్పికొడదాం
– మేడే స్ఫూర్తితో జాతీయ సమ్మెను జయప్రదం చేద్దాం : ‘నవతెలంగాణ’లో మేడే వేడుకల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సోషలిస్టు వ్యవస్థ మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందనీ, హక్కుల సాధనకు పోరాటమే మార్గమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. అసమానతల్లేని సమాజం కోసం మార్క్సిస్టు ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. పేదల విముక్తి కోసం జరిగే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చేందుకు వీలుగా ‘నవతెలంగాణ’ కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం(ఎమ్‌హెచ్‌ భవన్‌)లో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఉద్యోగి జంగయ్య అరుణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం ఇన్‌చార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ…మేడే ఔన్నత్యాన్ని వివరించారు. మనదేశంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల గురించి సోదాహరణంగా చెప్పారు. పని గంటలు, లేబర్‌ కోడ్‌లు, కనీస వేతనాలు, కార్మిక హక్కుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. వాటిని తిప్పికొట్టేందుకు ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పని గంటలు తగ్గించాలనే డిమాండ్లతో నాడు ఉద్యమాలు చేస్తే…పని దినాలను పెంచేందుకు నేడు కేంద్రం కుట్రలు పన్నుతోందని జాన్‌వెస్లీ వాపోయారు. దీని ద్వారా పెట్టుబడిదారీ వర్గానికి మేలు చేయడమే లక్ష్యంగా మోడీ సర్కార్‌ పని చేస్తోందని తెలిపారు. సంపద సృష్టిస్తున్న వారికేమో హక్కులు లేకుండా చేయడం, సంపదను వెనకేసుకుంటున్న వారి ప్రయోజనాలను మాత్రం కాపాడటం.. ఇదేనా మీ పాలనా? అని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పది మంది కార్పొరేట్లు, పెట్టుబడిదారీ వర్గాల చేతుల్లో 90 శాతం దేశ సంపద కేంద్రీకృతమైందని చెప్పారు. దీంతో పేదలకు విద్యా, వైద్యం అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయించిన రూ.26 వేల కనీస వేతనం ఎక్కడా అమలు కావటం లేదని చెప్పారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుల అవసరాలు తీర్చేలా ప్రభుత్వ విధానాలు లేవని విమర్శించారు. దేశంలో 80 శాతం భూమి 20 శాతం మంది భూస్వాముల చేతుల్లోనే ఉందని గుర్తు చేశారు. వారికి కనీసం చిన్న గూడు కూడా కల్పించకుండా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో పేదలకు విద్యా, వైద్యం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల హక్కుల సాధన, కనీస వేతనాల అమలు, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నవతెలంగాణ బుక్‌ హౌస్‌ ఎడిటర్‌ కె ఆనందాచారి మాట్లాడుతూ దేశంలోని పేదరికానికి కారణం సంపద లేకపోవడం కాదు…సంపద సక్రమంగా పంపిణీ కాకపోవడమేనన్న మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యలను ఉటంకించారు. సమాజంలో కమ్యూనిస్టులకు ఒక మంచి పేరుందనీ… ఇంత అన్యాయం జరుగుతున్నా ఎర్రజెండా వాళ్లు ఏం చేస్తున్నారంటూ బూర్జువా పార్టీల నేతలు సైతం ప్రశ్నిస్తుంటారని తెలిపారు. ఆ విశ్వాసం, నమ్మకాన్ని మరింతగా ప్రోది చేసుకునేందుకు వీలుగా నవతెలంగాణ తన పాత్రను సమర్థవంతంగా పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌, మేనేజర్‌ రేణుక, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బోర్డు సభ్యురాలు ఎస్‌కే సలిమా ఆహూతులను వేదికపైకి ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img