Wednesday, July 30, 2025
E-PAPER
Homeబీజినెస్పెట్టుబడిదారుల రక్షణ కోసం SEBI, NSE కలసి ఆర్థిక మోసాలపై చర్యలకు శ్రీకారం

పెట్టుబడిదారుల రక్షణ కోసం SEBI, NSE కలసి ఆర్థిక మోసాలపై చర్యలకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల అవగాహన పెంచేందుకు #SEBIvsSCAM అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా రకరకాల ఆర్థిక మోసాల గురించి సమాచారం ఇవ్వడం, అలాగే ఇలాంటి మోసాల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో పెట్టుబడిదారులకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సెక్యూరిటీల మార్కెట్‌లో మోసాల నుంచి రిటైల్ పెట్టుబడిదారులను రక్షించేందుకు SEBI తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగంగా నిలుస్తోంది. SEBI మార్గదర్శకత్వం మరియు నియంత్రణలో, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE) ఈ ప్రచారానికి భాగస్వామిగా ఉంటూ, సమగ్రంగా ఒక పెట్టుబడిదారుల రక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది.

మోసగాళ్లు పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతన, మోసపూరిత పద్ధతులను ఉపయోగిస్తున్న ఆధునిక కాలంలో, డిజిటల్ ఆర్థిక మోసాలు తీవ్రమవుతున్న సందర్భంలో ఈ అవగాహన ప్రచారం ఆవశ్యకతగా మారింది. నకిలీ ట్రేడింగ్ యాప్స్, డీప్ ఫేక్ వీడియోల నుండి అనధికార పెట్టుబడి సలహాదారులు మరియు సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే స్టాక్ సూచనల వరకు, స్కామర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీడుతున్నారు. అనేక సందర్భాలలో, వ్యక్తులు హామీ ఇచ్చిన రాబడులు/అసాధారణంగా అధిక లాభాలు, పంప్-అండ్-డంప్ వ్యూహాలు, డబ్బా ట్రేడింగ్, మోసపూరిత విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడి అవకాశాలు వంటి పథకాల వలలో చిక్కి, గణనీయమైన ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు.

#SEBIvsSCAM ప్రచారం, పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంచడం, సురక్షిత పెట్టుబడి అలవాట్లను ప్రోత్సహించడం మరియు తెలివైన నిర్ణయాలు తీసుకునే శక్తిని అందించడం లక్ష్యంగా కొనసాగుతోంది. సాధారణ మోసాలపై దృష్టి సారించి, అవి ఎలా జరుగుతాయో తెలియజేసే మార్గదర్శకతను అందించడం ద్వారా, ఈ ప్రచారం పెట్టుబడిదారులు మోసపు సంకేతాలను గుర్తించడం, మూలాలను ధృవీకరించడం మరియు అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం వంటి కీలక చర్యలు తీసుకునేలా సహాయపడుతుంది, తద్వారా మరింత సురక్షితమైన, పారదర్శకమైన పెట్టుబడి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గరిష్ట వ్యాప్తిని నిర్ధారించేందుకు, సెబీ పర్యవేక్షణలో ఎన్ఎస్ఈ టెలివిజన్, రేడియో, ప్రింట్, డిజిటల్ మరియు సోషల్ మీడియా వంటి వివిధ మీడియా ప్లాట్‌ఫారాల సమ్మేళనాన్ని వినియోగించనుంది. భౌతిక, డిజిటల్ మరియు హైబ్రిడ్ మోడ్‌లలో నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన సందేశాలను కూడా వ్యాప్తి చేస్తాం. ఈ బహుళ-ఛానల్ విధానం పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని పెట్టుబడిదారులకు, బహుళ భాషలలో, విభిన్న ప్రేక్షకులకు అందుబాటులో ఉండే మరియు ఆకర్షణీయమైన ఫార్మాట్ల ద్వారా పెట్టుబడిదారులను చేరుకోవడం లక్ష్యంగా రూపొందించబడింది.

పెట్టుబడిదారులకు సలహా: అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి

•       సెక్యూరిటీల మార్కెట్లో హామీ లేదా స్థిర రాబడి వాగ్దానాలకు లొంగిపోకండి. ఇటువంటి ప్రతిపాదనలు చట్ట విరుద్ధమైనవి మరియు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే అవకాశమున్నవి.
•       తెలియని మూలాల నుండి వచ్చే అయాచిత సందేశాలను పూర్తిగా నివారించండి. మీరు పొందే పెట్టుబడి సంబంధిత సమాచారాన్ని ఎల్లప్పుడూ సెబీ, ఎన్ఎస్ఈ లేదా సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ధృవీకరించండి.
•       క్రమబద్ధీకరణలేని యాప్లను డౌన్లోడ్ చేయడం, లేదా పెట్టుబడి సలహాల పేరిట పనిచేసే అనధికారిక చాట్ గ్రూపుల్లో చేరడం మోసపూరిత కార్యకలాపాలకు దారితీయవచ్చు.
•       సెబీ-రిజిస్టర్డ్ మధ్యవర్తులు లేదా పరిశోధనా విశ్లేషకులతో మాత్రమే నిమగ్నం అవ్వండి. వారి ఆధారాలను ఇక్కడ ధృవీకరించండి: https://www.sebi.gov.in/sebiweb/other/OtherAction.do?doRecognised=yes  
•       అధికారిక యాప్ స్టోర్ల (Google Play Store / Apple App Store) ద్వారా మాత్రమే సెబీ-రిజిస్టర్డ్ ట్రేడింగ్ సభ్యుల అనువర్తనాలను డౌన్లోడ్ చేయండి. అనువర్తనాలను తప్పనిసరిగా ధృవీకరించండి: https://www.nseindia.com/trade/members-compliance/list-of-mobile-applications
•       మీ స్టాక్ బ్రోకర్ యొక్క రిజిస్టర్డ్ క్లయింట్ బ్యాంక్ ఖాతాలకు మాత్రమే నిధులను బదిలీ చేయండి. ఖాతా వివరాలను ఇక్కడ ధృవీకరించండి: https://enit.nseindia.com/MemDirWeb/form/tradingMemberLocator_beta.jsp
•       2025 అక్టోబర్ 1 నుంచి, పెట్టుబడిదారులు SEBI-నమోదిత మధ్యవర్తులకు చెల్లింపులు చేయడానికి ప్రామాణిక UPI హ్యాండిల్ ఫార్మాట్‌ను (ఉదాహరణకు, abc.brk@validbank) ఉపయోగించాల్సి ఉంటుంది.
•       ఏదైనా మోసపూరిత కార్యకలాపాలను మీరు www.cybercrime.gov.in వద్ద నివేదించవచ్చు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
 పెట్టుబడిదారుల మద్దతు కోసం, దయచేసి NSE ని 1800 266 0050 నెంబర్‌లో సంప్రదించండి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ప్రజా ప్రయోజనంలో జారీ చేయబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -