– మేడే కార్యక్రమంలో సారంపల్లి, సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మేడే స్పూర్తితో ఈనెల 20న జరగనున్న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మేడేను పురస్కరించుకుని సారంపల్లి అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు ఎనిమిది గంటల విధానాన్ని పోరాడి సాధించుకుంటే, నేడు మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ల పేరుతో 13 గంటల వరకు చట్టబద్ధంగానే పని చేయించుకునే అవకాశాన్ని పెట్టుబడిదారులకు కల్పించిందని విమర్శించారు. మోడీ పాలనలో కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. విద్యుత్ సవరణ చట్టం ద్వారా వ్యవసాయ రంగానికి పేద మధ్యతరగతి ప్రజలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులను కోత విధించారనీ, పనిని ఎత్తేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో కల్పించిన ప్రజాతంత్ర హక్కులను చట్టాలను ఎత్తేసే కుట్ర చేస్తున్నదని తెలిపారు. పెరుగుతున్న ధరలను నియంత్రణ చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కనీస వేతనాలను పెంచకపోవడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, అరిబండి ప్రసాద్ రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. ఆంజనేయులు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఐఏఎస్ అకాడమీ ఏవో సతీష్ తదితరులు పాల్గొన్నారు.
20న గ్రామీణ భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES