నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపిలు మంగళవారం ఆందోళన చేపట్టాయి. ఈ జాబితాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గత ఆరు రోజులుగా పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంటులో కార్యకలాపాలకు ముందు, వామపక్ష పార్టీలు సహా కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఆర్‌జెడిలకు చెందిన పలువురు ఎంపిలు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై నిరసన చేపట్టారు. ‘ఓట్ల దొంగతనం ఆపండి’, ‘ఎస్‌ఐర్‌ను తిరిగి వెనక్కి తీసుకోండి’ అని నినాదాలు చేపట్టారు. ‘ఓట్ల లూటీ ఆపండి’, కేంద్రం, ఎన్నికల కమిషన్ (ఇసి)లు ‘కుమ్మక్కు’ అయ్యాయన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నుండి బీహార్ ఎస్‌ఐఆర్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ‘ఓటు హక్కు లేకుండా చేయడం’ లక్ష్యంగా ఈసి చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.