– రేపే లాంఛనంగా ప్రారంభం
– మండల స్థాయిలో అవగాహనా సదస్సులు
– ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు : సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) యాక్ట్, 2025ను పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని ఎంపిక చేసిన మూడు మండలాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజైన ఈ నెల 14న సోమవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆ పోర్టల్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంబంధింత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ భారతిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న మూడు మండలాల్లో ప్రజలు, మేధావులు, భూ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలనీ, వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. వారి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భూ భారతి చట్టంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయాలని సీఎం చెప్పారు. ప్రజలు, రైతులకు అర్ధమయ్యేలా, సులభమైన భాషలో పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎం అప్పగించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సంగీత సత్యనారాయణ, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్లో విస్తృత ప్రచారం
భూ భారతి చట్టంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో అవగాహనా సదస్సులను ఏర్పాటు చేస్తోంది. గత సర్కార్ తెచ్చిన ఆర్వోఆర్-2020 స్థానంలో తెచ్చిన ఈ చట్టం రైతులకు ఏ విధంగా మేలు చేకూరుస్తుంది. భూ వివాదాలు తలెత్తినప్పుడు రైతులు ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలను ఈ అవగాహన సదస్సులో అధికారులు వివరించనున్నారు. ఆర్వోఆర్ 2020లో పట్టాపాస్ బుక్‌లో ఏవైనా తప్పులు దొర్లితే దాన్ని సరి చేయడానికి ఎంఆర్వో నుంచి కలెక్టర్ వరకు అధికారాలు లేని పరిస్థితి ఉండేది. కనీసం ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా లేదు. కొత్త చట్టానికి, పాత చట్టానికి మధ్య ఉన్న తేడాను ప్రజలకు వివరించేందుకు అవగాహనా సదస్సులు బాగా ఉపయోగపడతాయని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే మొదటి దశలో ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం.
పైలట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో భూ భారతి
- Advertisement -
RELATED ARTICLES