నవతెలంగాణ-హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈక్రమంలో దేశంలోని పలు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు. తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు బుధవారం కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది.
ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో 16 గేట్లు 5 అడుగులు, 10గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి రెండు లక్షల 69వేల 476 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,05,426 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3,13,704క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 587.20 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 305.6242 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450టీఎంసీలుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
మరోవైపు సాగర్ ప్రాజెక్టు గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో..పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్ జలకళను తిలకించడానికి భారీ యోత్తున్న సందర్శకులు తరలి వస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సాగర్ అంతా కలియతిరుగుతున్నారు.