– వేవ్స్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోడీ
– భారత్‌లో స్టోరీ టెల్లింగ్‌కు ఇదే సరైన సమయం
ముంబయి: ‘సృజనాత్మక బాధ్యత’ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నొక్కి చెప్పారు. మానవతావాద వ్యతిరేక ఆలోచనల నుండి యువతరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా వుందని ఆయన పేర్కొన్నారు. ఈనాడు ప్రజల జీవితాల్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా కీలక పాత్ర పోషిస్తోందని, అందువల్ల మానవుల్లో సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి అదనపు కృషి అవసరమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ”స్టోరీ టెల్లింగ్ (కథలు చెప్పడం)కు కొత్త మార్గాల కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న వేళ ప్రపంచం కోసం భారత్‌లో సృష్టించేందుకు ఇదే సరైన సమయం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) 2025ను ప్రధాని గురువారం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలు, కథకులు (స్టోరీ టెల్లర్స్), ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలను ఏకం చేసే పరివర్తనా వేదికగా వేవ్స్ సదస్సును ఆయన అభివర్ణించారు. దాదాపు 30 దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో ప్రధాని కీలకోపన్యాసం చేశారు. ”ఈనాడు వందకు పైగా దేశాల నుండి కళాకారులు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు అందరూ ఒకే వేదికపై సమావేశమయ్యారు. ప్రతిభ, సృజనాత్మకతకు సంబంధించి ఒక అంతర్జాతీయ వ్యవస్థకు మనం పునాది వేయాలి. వేవ్స్ అనేది అంటువంటి ఒక అంతర్జాతీయ వేదిక, ఇది ప్రతి ఒక్క కళాకారుడికి, సృష్టికర్తకి చెందినదే” అని మోడీ పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం ‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ (సృష్టికర్తలను, దేశాలను అనుంథానించడం). అంతర్జాతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను సెంట్రల్ హబ్‌గా రూపొందించాలన్నదే ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా వుంది. 2029 నాటికి భారతదేశ మీడియా, వినోద రంగాలకు 5వేల కోట్ల డాలర్ల విలువైన అవకాశాలను ఆవిష్కరించా లన్నదే ఈ వేవ్స్ 2025 ఆకాంక్షగా వుంది. విదేశాల్లో సృజనాత్మక రంగాల్లో, పరిశ్రమల్లో పరస్పర సహకారంపై చర్చించేందుకు 25 దేశాల నుండి మంత్రులు, అధికారులను కలుపుకుని గ్లోబల్ మీడియా డైలాగ్ (జిఎండి)ని ప్రారంభించారు. వేవ్స్ సదస్సును పురస్కరించుకుని డిజిటల్ మార్కెట్‌గా వేవ్స్ బజార్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 6,100మంది కొనుగోలుదా రులు, 5200మంది విక్రయదారులు, 2100 సృజనాత్మక ప్రాజెక్టులు వున్నాయి. అపారమైన నెట్‌వర్కింగ్‌కు, వ్యాపార అవకాశాలకు పుష్కలంగా వెసులుబాటు వుంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, స్క్రీన్ పరిమాణం తగ్గుతున్న కొద్దీ పరిధి అనంతంగా మారుతోందన్నారు. స్టార్టప్‌లను, పారిశ్రామికవేత్తలను, విధాన రూపకర్తలను, క్రియేటర్లను అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం ద్వారా మీడియా, వినోదాత్మక రంగాలకు, డిజిటల్ ఆవిష్కరణలకు భారత్‌ను అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మన భారతీయ కథల్లో శాస్త్రీయ పరిజ్ఞానం, కల్పనలు, ధైర్యసాహసాలు అన్నీ వుంటాయి. మన కథల కోశాగారం సుసంపన్నమైది, వైవిధ్యభరితమై నది. దీన్ని ప్రపంచ ప్రజల ముందుంచడమే వేవ్స్ అతిపెద్ద బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. పద్మ అవార్డులను ప్రజా అవార్డులుగా మార్చామన్నారు. దేశంలో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని కూడా గుర్తించామన్నారు. అంతర్జాతీయంగా వున్న ప్రతిభావంతులకు ఇక్కడ గౌరవం లభిస్తుందన్నారు. మీరు ఇక్కడకు వస్తే భారత్‌తో అత్యంత సహజంగా కనెక్ట్ అవుతారని ఈ నమ్మకాన్ని మీకు ఇవ్వాలన్న దే మా లక్ష్యమని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ-సృజనాత్మక కార్యకలాపాలతో, సంస్కృతీ సాంప్రదాయాలతో, కళారూపాలతో సంపదను, ఆర్థిక కార్యకలాపాలను సృష్టించడం.) గా భారత్ మారుతోందని మోడీ చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో, భారత స్ఫూర్తిని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్ళడంలో భారతీయ సినిమా విజయం సాధించిందని చెప్పారు.
సృజనాత్మకతకు పెద్దపీట
- Advertisement -
RELATED ARTICLES