నవతెలంగాణ-హైదరాబాద్: చర్చలతో ‘రెండు దేశాల ఏర్పాటు’ పరిష్కారానికి భారత్ ఎప్పుడూ మద్దతునిస్తోందని గాజాలో నెలకొన్న సంఘర్షణపై కేంద్రప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇజ్రాయిల్‌తో శాంతియుతంగా జీవించడం, సురక్షితమైన గుర్తింపు పొందిన సరిహద్దులతో సార్వభౌమ, స్వతంత్ర ఆచరణీయ పాలస్తీనా దేశ స్థాపన కోసం చర్చలతో ‘రెండు దేశాల ఏర్పాటు’ పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలిపింది. పాలస్తీనా ఘర్షణకు భారత్ మద్దతు ఇవ్వడం మన విదేశాంగ విధానంలో అంతర్భాగమా అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)ని ప్రశ్నించారు.
”పాలస్తీనా పట్ల భారతదేశ విధానం చాలాకాలంగా ఉంది. చర్చల ద్వారా రెండు దేశాల ఏర్పాటుకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది” అని విదేశాంగ శాఖ సహాయక మంత్రి (ఎంఒఎస్) కృతివర్ధన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై జరిపిన దాడులను, కొనసాగుతున్న ఇజ్రాయిల్ -హమాస్ సంఘర్షణలో సాధారణ పౌరుల మరణాలను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. భద్రతా పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతూనే ఉందని, కాల్పుల విరమణకు, బందీల విడుదలకు, చర్చలకు మరియు శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చిందని అన్నారు.
గాజాలో తక్షణ, షరతులు లేకుండా శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల, అడ్డంకులు లేకుండా మానవతాసాయం అందాలని డిమాండ్ చేస్తూ యుఎన్ జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జిసి)లో జూన్ 12న ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ ఎందుకు గైర్హాజరైందని ఎంఇఎని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. పాలస్తీనా ప్రజలకు మానవతాసాయం సురక్షితంగా, సకాలంలో మరియు నిరంతరం అందించాల్సిన అవసరాన్ని భారత్ స్పష్టం చేసిందని సింగ్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ -పాలస్తీనాలను దగ్గరగా చేర్చడం, ప్రత్యక్ష శాంతి చర్చలను తిరిగి ప్రారంభించడానికి అనువైన పరిస్థితులను సృష్టించడానికి భారత్ దోహదపడుతుందని పునరుద్ఘాటించిందని అన్నారు.
యుఎన్, బ్రిక్స్, ఎన్‌ఎఎం, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వంటి వివిధ ద్వైపాక్షిక, బహుపాక్షిక సదస్సుల్లో భారత పైన పేర్కొన్న వైఖరిని పునరుద్ఘాటించిందని అన్నారు. ఈ విధానాలకు అనుగుణంగా లేకపోవడం, చర్చల అంశం లేకపోవడం మరియు తీర్మానం అసమతుల్యతను పరిగణనలోకి తీసుకుని జూన్ 12న జరిగిన యుఎన్‌జిఎ అత్యవసర ప్రత్యేక సమావేశంలో తీర్మానంపై ఓటింగ్ భారత్ దూరంగా ఉందని అన్నారు.