నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆ రాష్ట్రంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పలు రోజులుగా ఇంటింటి సర్వే చేపట్టి పలు ఆధారాలతో కూడిన ఓటర్ లిస్ట్ ఈసీ రూపొందించింది. తాజాగా ఈ SIR ప్రక్రియపై ఎన్నికల కమిషనర్ కీలక ప్రకటన చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) సర్వే కు సంబంధించి ప్రాథమిక ముసాయిదా సిద్ధమైందని వెల్లడించింది. రేపు ఈ జాబితా ముసాయిదా కాపీలను ఆ రాష్ట్రంలో గుర్తింపున పొందిన పార్టీలకు అందజేస్తామని ఈసీ కమిషనర్ గణేష్ కుమార్ తెలిపారు.
SIR ముసాయిదాపై ఎలాంటి అభ్యంతరాలున్న రాజకీయ పార్టీలు తమ దృష్టికి తేవాలని సూచించింది. ఆగష్టు 1 నుంచి సెప్టెంబర్ 1 తేదీలోపు మార్పులు చేర్పులకు అవకాశముంటుందని ఈ మేరకు ప్రెస్ నోట్ లో పేర్కొంది. బీహార్‌లో 7.24 కోట్లకు పైగా ఓటర్లు జూన్ 24 నుండి జూలై 25 వరకు జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద తమ గణన ఫారాలను సమర్పించారని ఈసీ పేర్కొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఖచ్చితత్వాన్ని పెంచే లక్ష్యంతో.. రాష్ట్రవ్యాప్తంగా SIR విజయవంతమైన పౌరుల భాగస్వామ్య ప్రయత్నం”గా కమిషన్ అభివర్ణించింది.
మరోవైపు ఆగష్టు 12, 13 తేదీల్లో SIRపై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈక్రమంలో ఈసీ ముసాయిదాను విడుదల చేయడం గమనార్హం.