నవతెలంగాణ-హైదరాబాద్: శిబూ సోరెన్ ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన అందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూ సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగపడ్డాయని కొనియాడారు. శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటని అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు, కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.