– పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ గెలుపు
– ఛేదనలో అభిషేక్ శర్మ శతక మోత
– రాణించిన ట్రావిశ్ హెడ్, క్లాసెన్
– పంజాబ్ 245/6, హైదరాబాద్ 247/2
సన్‌రైజర్స్ జూలు విదిల్చింది. ట్రావిషేక్ జోడీ ధనాధన్ మళ్లీ మొదలెట్టింది. అభిషేక్ శర్మ (141), ట్రావిశ్ హెడ్ (66) మెరుపులతో ఉప్పల్ స్టేడియాన్ని ఊపేయగా.. 246 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఊదేసింది. 18.3 ఓవర్లలోనే 247 పరుగులు బాదిన సన్‌రైజర్స్ ఐపీఎల్18లో రెండో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (82) అర్థ సెంచరీతో తొలుత పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు చేసింది. 36222 మంది అభిమానులతో ఉప్పల్ స్టేడియం ఇటు జన జాతర, అటు పరుగుల పండుగను చూసింది.
నవతెలంగాణ-హైదరాబాద్
అభిషేక్ శర్మ (141, 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్ల రూపంలోనే (24 బంతుల్లో) 116 పరుగులు పిండుకున్న అభిషేక్ ఉప్పల్ స్టేడియంలో నవ రికార్డులు నమోదు చేశాడు. 40 బంతుల్లోనే శతక బాదిన అభిషేక్ శర్మకు ట్రావిశ్ హెడ్ (66, 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (21 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలవటంతో శనివారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 18.3 ఓవర్లలోనే 247 పరుగులు బాదిన హైదరాబాద్.. మరో 9 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. అంతకుముందు, శ్రేయస్ అయ్యర్ (82, 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రభుసిమ్రన్ సింగ్ (42, 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్షు ఆర్య (36, 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు, సహా మార్కస్ స్టోయినిస్ (34 నాటౌట్, 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరవటంతో పంజాబ్ కింగ్స్ 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో శతక విధ్వంసం సృష్టించిన అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
అభిషేక్ అదరగొట్టాడు
సన్‌రైజర్స్ టార్గెట్ 246 పరుగులు. గత నాలుగు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం అంతంతమాత్రమే!. కానీ ఛేదనలో హైదరాబాద్ ఎక్కడా తగ్గలేదు. ఆరంభం నుంచీ ఆఖరు వరకు అదరగొట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (141), ట్రావిశ్ హెడ్ (66) దంచికొట్టారు. పవర్‌ప్లేలో 83 పరుగులు పిండుకున్న ఓపెనర్లు.. ఆ తర్వాత టాప్ గేర్‌లోనే దూసుకెళ్లారు. అభిషేక్ శర్మ మూడు సిక్స్‌లు, ఏడు ఫోర్లతో 19 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా.. ట్రావిశ్ హెడ్ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఓ ఎండ్‌లో అభిషేక్ పంజాబ్ బౌలర్లను ఊచకోత కోయటంతో పరుగుల పండుగ సాగింది. 10.5 ఓవర్లలో 150 పరుగులు చేసిన సన్‌రైజర్స్.. 14.5 ఓవర్లలో 200 పరుగుల మార్క్ చేరుకుంది. చాహల్ ఓవర్లో భారీ సిక్సర్ తర్వాత హెడ్ నిష్క్రమించినా.. హెన్రిచ్ క్లాసెన్ (21 నాటౌట్) తోడుగా అభిషేక్ దండయాత్ర కొనసాగింది. ఆరు సిక్స్‌లు, 11 ఫోర్లతో 40 బంతుల్లో అభిషేక్ సెంచరీ కొట్టాడు. మరో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో రెచ్చిపోయిన అభిషేక్ ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ (9 నాటౌట్)తోడుగా క్లాసెన్ లాంఛనం ముగించాడు. 18.3 ఓవర్లలోనే 247 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
మెరిసిన అయ్యర్
టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. ఓపెనర్ ప్రియాన్షు ఆర్య (36) పవర్‌ప్లేలో విరుచుకుపడ్డాడు. 13 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. ప్రభుసిమ్రన్ సింగ్ (42) సైతం మరో ఎండ్‌లో దూకుడు చూపించాడు. దీంతో 4 ఓవర్లలోనే పంజాబ్ 66 పరుగులు చేసింది. ప్రియాన్షు అవుటైనా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తొలి నుంచి ఎదురుదాడి చేసిన అయ్యర్ ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 22 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. నెహల్ వదేరా (27), మార్కస్ స్టోయినిస్ (34 నాటౌట్) ఆఖర్లో అదరగొట్టారు. శశాంక్ సింగ్ (2), మాక్స్‌వెల్ (3) విఫలం అయ్యారు. ఆఖరు ఐదు ఓవర్లలో 68 పరుగులు చేసిన పంజాబ్.. మహ్మద్ షమి వేసిన ఆఖరు ఓవర్లో ఏకంగా 27 పరుగులు పిండుకుంది. మూడు ఓవర్లలో 20 ప్లస్, నాలుగు ఓవర్లలో 15 ప్లస్ పరుగులు చేసిన పంజాబ్.. ఏడు ఓవర్లలోనే 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ (4/42), ఈషన్ మలింగ (2/45) వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమి (0/75) అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఆరెంజ్ ఆర్మీకి అంకితం!
ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా నిలిచిన అభిషేక్ శర్మ (141) శతక సంబురాన్ని స్పెషల్‌గా చేసుకున్నాడు. 100 పరుగుల మార్క్ చేరుకున్న అనంతరం ప్యాంట్ పాకెట్‌లో నుంచి ఓ కాగితం బయటకు తీసిన అభిషేక్ శర్మ అభివాదం చేశాడు. ఆ కాగితంపై ‘దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ’ అని రాసి ఉంది. వరుస పరాజయాలు ఎదురైనా సన్‌రైజర్స్‌కు ఉప్పల్ స్టేడియంలో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు 36222 మంది అభిమానులతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది.
245 ఉఫ్
- Advertisement -
RELATED ARTICLES