Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆర్థిక సుస్థిరతకు నవ శకం చిహ్నం

ఆర్థిక సుస్థిరతకు నవ శకం చిహ్నం

- Advertisement -

– సముద్ర జల రవాణాలో సరికొత్త అధ్యాయం
– కేరళలో విళింజం సీ పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
తిరువనంతపురం:
తిరువనంతపురం సమీపంలోని విళింజమ్‌ అంతర్జాతీయ సీ పోర్ట్‌ మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. దీంతో భారతదేశం సముద్ర జల రవాణా మౌలిక వసతులకు సంబంధించి ప్రధానమైన మైలురాయికి చేరినట్లైంది. రూ.8,867 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఇటు కేరళకే కాకుండా అటు భారత్‌కు కూడా గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఓడరేవును ఆర్థిక సుస్థిరతకు ‘కొత్త శకం చిహ్నం’ గా ప్రధాని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాధాన్యతలను వివరించారు. కేరళ అభివృద్ధి ద్వారా భారతదేశం పురోగమిస్తుందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో, షిప్పింగ్‌లో భారతదేశ పాత్ర ఇనుమడిస్తుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్‌, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఎంపి శశి థరూర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి 75శాతం షిప్‌మెంట్‌లు విదేశీ పోర్టుల ద్వారా జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థికంగా గణనీయమైన నష్టాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితి మారబోతోందని అన్నారు. విళింజమ్‌ పోర్టును ప్రారంభించడం, దేశీయ ఓడరేవుల మౌలిక వసతులను బలోపేతం చేయడంతో విదేశాలకు తరలిపోతున్న ఆదాయం ఇకపై భారత్‌కే తిరిగి వస్తుందన్నారు. ఈ మార్పు వల్ల కొత్త ఆర్ధిక అవకాశాలు ఉత్పన్నమవుతాయన్నారు. ముఖ్యంగా కేరళకు, విళింజం నివాసులకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వస్తాయన్నారు. గతంలో షిప్పింగ్‌ సంబంధిత కార్యకలాపాల నుండి వచ్చే జిడిపిలో ప్రధాన వాటా దేశం వెలుపల నుండే వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందన్నారు. కేరళకు గల దీర్ఘకాలికమైన సముద్ర జలాల వారసత్వాన్ని ముఖ్యంగా అరేబియా సముద్ర జలాల ద్వారా జరిగిన చారిత్రక వాణిజ్యాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒకానొక సమయంలో, అంతర్జాతీయ జిడిపిలో కేరళదే గణనీయమైన వాటా. ఇతర దేశాలతో భారత్‌ను వేరు చేసేది గణనీయమైన ఈ సముద్ర జలాల సామర్ధ్యాలే, ఓడరేవు నగరాల్లో పరిఢవిల్లే ఆర్థిక వ్యవస్థే. సంపద్వంతమైన ఆ శకంలో కేరళ కీలక పాత్ర పోషించిందని మోడీ గుర్తు చేసుకున్నారు. గతంలో షిప్పింగ్‌ పరిశ్రమకు సంబంధించిన లొసుగులు, లోపాలను ప్రధాని వివరించారు. సరుకు రవాణాలో గణనీయమైన జాప్యం జరిగేదన్నారు. కానీ ఈనాడు మన ప్రధానమైన ఓడరేవులు పెద్ద మొత్తాల్లో కార్గోను చాలా తక్కువ సమయాల్లోనే తరలించగల సామర్ధ్యాలను సంతరించుకున్నాయన్నారు. కీలకమైన ఈ రంగంలో నిరంతరంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సముద్ర రవాణా రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి వుందన్నారు. కొత్త ఆవిష్కరణలను, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం చేయాలన్నారు. గత దశాబ్ద కాలంలో కేరళ వంటి తీర ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధిని వేగిరపరిచేలా, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమివ్వడంలో మనం గణనీయమైన ప్రగతి సాధించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ విళింజం పోర్టు ప్రాజెక్టుతో గణనీయమైన ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయన్నారు. కేరళ అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటును అందిస్తుందని పునరుద్ఘాటించారు. కేరళ ప్రజల నిబద్ధత, అంకిత భావంతో అంతర్జాతీయ సముద్ర జల రవాణాలో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. మనందరం కలిసి అభివృద్ధి చెందిన, సంపద్వంతమైన కేరళను నిర్మించగలమన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad