న్యూఢిల్లీ: సమాజానికి మార్గదర్శకం చేయడానికి వృద్ధులు చాలా అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జ్ఞానం, సంప్రదాయానికి వృద్ధులు మూల స్థంభాలని, దేశంలో వృద్ధుల గౌరవం, ఆనందం, శ్రేయస్సును కాపాడ్డం అందరి బాధ్యతని రాష్ట్రపతి స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడంలోనూ, భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేయడంలోనూ వృద్ధుల పాత్ర అమూల్యమైనదని తెలిపారు. వృద్ధుల సంక్షేమానికి మనమంతా కట్టుబడి ఉండాలని, వారి విస్తృతమైన అనుభవాల నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే, వృద్ధుల పట్ల గౌరవం అనేది మన సంప్రదాయంలోనే పొందుపర్చబడి ఉందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అనేక ఇళ్లల్లో చిన్నారులు తమ తాతాఅవ్వలతో సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు చెబితే వినని పిల్లులు, వారి తాతాఅవ్వలు చెబితే సంతోషంగా అంగీకరిస్తారని రాష్ట్రపతి తెలిపారు. కుటుంబానికి మానసిక మద్దతుగా వృద్ధులు నిలుస్తారని ఆమె చెప్పారు.అయితే వృద్దులకు పెరుగుతున్న సమస్యలపై ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. యువకులు ఉద్యోగాల కోసం వలస వెళుతుండంతో వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారని, అలాగే కుటుంబాలతో కలిసి ఉంటున్నా వృద్ధులకు తగిన ప్రేమ, గౌరవం లభించడం లేదని, మరికొంత మంది వృద్ధులను భారంగా భావిస్తున్నారని రాష్ట్రపతి ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.