– మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలి
– దోపిడీవర్గాలకు వ్యతిరేకంగా ఉన్నందుకే వారిపై అణచివేత : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– ప్రశ్నించేవారిని భయపెట్టడం, చంపడమే మోడీ సర్కారు లక్ష్యం
– ఎర్రజెండాలు ఒక్కటైతే పేదలదే రాజ్యం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
– మావోయిస్టుల పోరాటాన్ని సామాజిక కోణంలో చూడాలి
– ఆర్‌ఎస్‌ఎస్ చెప్పేదొకటి..చేసేదొకటి : విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్
– బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దోపిడీ వర్గాలకు మావోయిస్టులు అడ్డంగా ఉన్నారనీ, అందుకే కేంద్ర ప్రభుత్వం వారిపై అణచివేత చర్యలకు పూనుకున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. ఆపరేషన్ కగార్‌ను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపేయాలనీ, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ప్రెస్‌క్లబ్‌లో ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ..ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యం మీదకు 25 వేల మంది భదత్రాబలగాన్ని పంపడం అవసరమా? అని ప్రశ్నించారు. అక్కడ ఆదివాసీ మహిళలపై లైగింకదాడులు జరుగుతున్నాయనీ, పురుషులను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని వాపోయారు. ఇలాంటి దుర్మార్గమైన హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దండకారణ్యంలోని కర్రెగుట్టలు మన దేశంలో లేవా? అక్కడ ఏం విముక్తి చేశారు? అక్కడకెళ్లి విజయం సాధించినట్టు జాతీయ జెండా పాతడమేంటి? అని ప్రశ్నించారు. మోడీ సర్కారు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెనుక దండకారణ్యంలోని అపారమైన ఖనిజవనరులను, అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. శాంతి చర్చల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
ఓంశాంతి అంటూనే మీరిచ్చే సందేశమేంటి? : చంద్రకుమార్
ఆర్‌ఎస్‌ఎస్ ఓంశాంతి జపం చేస్తూనే మరోవైపు తమకు వ్యతిరేకమైన భావజాల శక్తులు లేకుండా చేసే పనిలో ఉందని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ ఎండగట్టారు. అది చెప్పేదాంట్లో చేసేదాంట్లో పూర్తి వైరుధ్యం ఉంటుందని రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. మావోయిస్టులు శాంతి చర్చల కోసం సంకేతాలు పంపుతుంటే మోడీ సర్కారు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రపంచానికి శాంతిసందేశం ఇచ్చిన బుద్ధుడు పుట్టిన దేశం మనదన్నారు. అసమానతలు లేని భారత సమాజాన్ని రూపొందించాలని రాజ్యాంగం చెబుతుంటే పాలకులు మాత్రం సంపద కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించే లక్ష్యం నుంచి పాలకులు తప్పుకున్నారన్నారు. అదే సమయంలో ఆ రెండు రంగాలనూ కార్పొరేట్లకు అప్పగించారని విమర్శించారు. పేదల చేతుల్లో భూమి లేదు..అటవీ ప్రాంతాల్లో పీసా యాక్టు అమలు కావడం లేదని ఎత్తిచూపారు. ఇవన్నింటినీ పాలకులు చేయడం లేదు కాబట్టే ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. కొందరు పోరాటాల వైపు మళ్లారని చెప్పారు. మావోయిస్టుల పోరాటాన్ని సామాజిక పోరాటంగా చూడాలనీ, శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని కేంద్రానికి హితవు పలికారు. మావోయిస్టులతో చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కోరారు.
ప్రజాస్వామ్య దేశాన్ని నిరంకుశంగా మార్చే కుట్ర : కూనంనేని
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామిక దేశాన్ని నిరం కుశంగా మార్చే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం వెళ్లాలిగానీ మావోయిస్టులను తుదముట్టిస్తామని ప్రకటించే అధికారాన్ని, చంపించే హక్కును మోడీ, అమిత్‌షాలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని భయపెట్టడం, వినకపోతే చంపడమే లక్ష్యంగా పెట్టుకుని మోడీ సర్కారు ముందుకెళ్తున్నదని విమర్శించారు. కమ్యూనిస్టు భావజాలం అంటేనే బీజేపీకి గిట్టదనీ, అందుకే మోడీ సర్కారు ఈ చర్యలకు పూనుకున్నదని చెప్పారు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ప్రజాస్వామ్యం శాశ్వతమని అన్నారు. దండకారణ్యంలో నరమేధాన్ని కేంద్రం ఆపాలనీ, ఇరుపక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. ఎర్రజెండాలు విడివిడిగా ఉన్నాయి కాబట్టే మోడీ ఆటలు సాగుతున్నాయనీ, ఎర్రజెండాలన్నీ ఒక్కటైతే పేదోడిదే రాజ్యం అని నొక్కిచెప్పారు.
సాయుధ బలగాలను ప్రయోగించడం అవసరమా? : వేములపల్లి వెంకట్రామయ్య
దండకారణ్యంలో భారీ ఎత్తున సాయుధ బలగాలను ప్రయోగించడం అవసరమా? అని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య అన్నారు. ఆదివాసీలను ఎన్‌కౌంటర్ చేయడాన్నీ, చిత్రహింసలు పెట్టడాన్ని తప్పుబట్టారు. సాయుధబలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలనీ, క్యాంపులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ..ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి దాడులు సరిగాదన్నారు. నియంతృత్వ పాలన తేవాలని మోడీ సర్కారు చూస్తున్నదని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ కేంద్ర కమిటీ సభ్యులు రామచందర్, ఎమ్‌సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌సీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.మురహరి, అరుణోదయ నేత విమలక్క, పార్వర్డ్‌బ్లాక్ నేత విశ్వనాథం, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్-లిబరేషన్) రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రాజా, తదితరులు మాట్లాడుతూ.. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికే ఆపరేషన్ కగార్ అనీ, దీనివెనుక అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర ఉందని విమర్శించారు. ఆదివాసీలపై నిర్బంధం సరిగాదన్నారు. చంపడం, హత్యలు చేయడం ద్వారా ఎప్పటికీ శాంతి చేకూరదన్నారు. ఫాసిస్టు భావజాలం అందర్నీ మింగేస్తుందని హెచ్చరించారు. మధ్యయుగాల నాటి పాలనను మోడీ సర్కారు కొనసాగిస్తున్నదని విమర్శించారు.
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES