– యూనిఫామ్స్ మెటీరియల్ కొనుగోళ్లు
– సహకార శాఖ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలి
– నిలిచిన రైతు రుణమాఫీ నెల రోజుల్లోపు పూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– పోచంపల్లిలో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-భువనగిరి, భూదాన్ పోచంపల్లి
చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తామని, చేనేత వస్త్రాలు డూప్లికేట్‌ను నివారిస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో తడక రమేష్ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, చేనేత సదస్సులో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేవలం వెయ్యి మంది ఖాతాదారులు, రూ.6.50 లక్షలతో ప్రారంభించిన సహకార బ్యాంకు నేడు రూ.400 కోట్లతో లక్ష మంది ఖాతాలతో అభివృద్ధి చెందడం ఐక్యతకు, అంకితభావానికి నిదర్శనమన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించారన్నారు. కొంగర భాస్కరరావు ఆశయాన్ని నిలబెట్టారన్నారు. భూదాన్ ఉద్యమానికి పేరొందిన పోచంపల్లి ప్రాంతంలో ధాన్యం కూడా ఎక్కువగా పండుతుందన్నారు. చేనేత రంగాలను ప్రోత్సహించేందుకు పొదుపు పథకం ద్వారా రూ.290 కోట్లు విడుదల చేశామన్నారు. రూ.75 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉందన్నారు. చేనేత వస్త్రాలు డూప్లికేట్ రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా యూనిఫామ్స్ మెటీరియల్స్ కొనుగోలు చేయిస్తామని చెప్పారు. ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సాంకేతికంగా నిలిచిపోయిన రైతుల రైతు రుణమాఫీ నెల రోజుల్లోపు అందుతుందని తెలిపారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడటం, యునెస్కో వారిచే హెరిటేజ్ గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ.. పొదుపు పథకాలన్నీ అమల్లోకి తెస్తామన్నారు. ఆర్డీలు కట్టిస్తామన్నారు. ప్రతి చేనేత కార్మికుడికీ రూ.18 వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6 వేలు జమ చేసే పద్ధతి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చేనేత వస్త్రాలైన బెడ్‌షీట్లు, టవల్స్, లుంగీలు మార్కెటింగ్ చేసేందుకు ప్రోత్సాహకంగా షోరూమ్‌లను ఏర్పాటుచేసి విక్రయానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. టెక్స్‌టైల్స్ డిప్లొమా కోర్సులో 60 మంది అభ్యసిస్తున్నారని తెలిపారు. గతంలో 57 ఏండ్ల వారికే బీమా వర్తించేదని, ప్రస్తుత ప్రభుత్వం వయసుతో నిమిత్తం లేకుండా వృద్ధులకు కూడా ఐదు లక్షల బీమా వర్తింపజేస్తుందని తెలిపారు. బ్యాంక్ చైర్మెన్ తడక రమేష్, బ్యాంకు సీఈవో సీత శ్రీనివాస్ మాట్లా డుతూ.. పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు అంచలం చెలుగా ఎదుగుతూ మెరుగైన సేవలు అందించడం పట్ల అనేక అవార్డులను సాధించిందని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సొంత సంస్థగా నడిపించినప్పుడే సహకార సంఘాలు బలపడతా యన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత సంఘాలన్నీ కలిసి ఐక్యంగా నిలబడటం అభివృద్ధికి చిహ్నం అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట నెలకొల్పిన అవార్డ్స్ కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తడక వెంకటేశం, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి మదన్‌గోపాల్ స్వామి, భువనగిరి మార్కెట్ చైర్మెన్ రేఖ బాబురావు, ఆర్డీవో శేఖర్ రెడ్డి, నాయకులు గర్దాస్ బాలయ్య, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఎగ్జిబిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES