– అప్పులు, వడ్డీలకే సర్కార్ ఆదాయం
– బిల్లుల చెల్లింపులకు రొక్కం సున్నా
– ఏప్రిల్‌లో రాని రూ.500 కోట్లు!
– ఆందోళనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు
– పెండింగ్‌లోనే రూ.8 వేల కోట్ల బిల్లులు
– ఎమ్మెల్సీలపై పెరుగుతున్న ఒత్తిడి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ వేతనాలు, పెండింగ్ బిల్లులు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఏండ్లు గడుసు ్తన్నా బకాయిలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇక పీఆర్‌సీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి రవీంధ్రభారతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అప్పులు రూ.8.15 లక్షల కోట్లు
సీఎం మాటల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8.15 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇందులో గత బీఆర్‌ఎస్ సర్కారు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే కొత్తగా రూ.1.58 లక్షల కోట్ల మేర మళ్లీ రుణాలు తేవాల్సి వచ్చింది. కాగా ప్రతినెలా సర్కారుకు రూ.18 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నది. సుమారు రూ. 22 వేల కోట్ల ఆదాయం వస్తేనే ప్రభుత్వ కనీసావసరాలు తీరుతాయని సీఎం చెప్పారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ బకాయిలు రూ. 8 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దాదాపు రెండేండ్ల కుగాపైగానే బకాయిలు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి.
అత్యవసర బిల్లులకు జై
ఉద్యోగులు, రిటైర్డైనవారికి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు నిధులు ఏ ప్రాతిపదికన విడుదల చేయాలో చెప్పాలని ఉద్యోగ సంఘాలను ఆర్థికశాఖ గతనెలలోనే కోరింది. అయితే, నెలకు రూ.500 కోట్ల చొప్పున విడుదల చేసినా బకాయిలన్నీ చెల్లించేందుకు 10 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఆర్థికశాఖ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో పాత బిల్లుల్లో ముందు ఇవ్వాల్సినవి, కొంత ఆలస్యమైనా పరవాలేదనుకున్నవి చెప్పాలని ఉద్యోగ సంఘాలను అడిగింది. ఉద్యోగులతో చర్చించిన అనంతరం సంఘాల నేతలు ఉద్యోగుల వైద్యఖర్చుల బిల్లులు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ పెండింగులో ఉన్నాయనీ, వాటిని ముందుగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇక రిటైర్డైన వారికి చెల్లించాల్సిన బిల్లుల మొత్తాలు రూ.10 లక్షల నుంచి 50 లక్షల దాకా ఉన్నట్టు సమాచారం. అయితే, చిన్న మొత్తాలకే ఆర్థికశాఖ ప్రాధాన్యతినిస్తున్నది.
పెరిగిన వ్యయం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో కొత్తగా నియామకాలు చేసినందున ఉద్యోగులకు జీతభత్యాల వ్యయం సర్కారుపై పెరిగినట్టు ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది జీతాల చెల్లింపులకు మొత్తం రూ.40 వేల కోట్లు అవసరమని బడ్జెట్‌లో అంచనా వేయగా, గత ఏప్రిల్ నుంచి జనవరి నాటికే ఇందులో 88.8 శాతం అంటే రూ.35,555 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
గతేడాది ఇదే సమయంలో రూ.32,650 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అంటే గతేడాది కన్నా ఈ ఏడాది రూ.2,905 కోట్లు పెరిగాయి. ఈ ఏడాది పింఛన్లకు బడ్జెట్‌లో రూ.11,641 కోట్లు కేటాయించగా, తొలి 10 నెలల్లోనే రూ.14,153 కోట్లు ఆర్థికశాఖ చెల్లించింది. దీంతో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ఇటు అధికారులు, అటు మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏడాది ఉద్యోగ, పదవీ విరమణలు అధికంగా ఉన్నందు వల్ల పింఛన్ల భారం క్రమంగా పెరుగుతున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీలపై ఒత్తిడి
సర్కారు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా తాము ఎన్నుకున్న ప్రతినిధులు ఆశించినస్థాయిలో చొరవచూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కూడిన జేఏసీ ఏర్పాటైంది. ముగ్గురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. వీరంతా సర్కారుపై ఒత్తిడిని పెంచడం లేదనే భావన ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నెలకొంది.
ఏప్రిల్ బకాయి రూ. 500 కోట్లు ఇవ్వలే
నెల రోజుల కింద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలతో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పెండింగ్ బకాయిల్లో నుంచి ప్రతినెలా రూ. 500 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సైతం అంగీకరించారు. కాగా ఏప్రిల్ నెల బకాయిలు విడుదల కాలేదు. కాగా అప్పులు, బకాయిలు ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం అన్యాపదేశంగా పీఆర్సీ, బకాయిలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గుబులు ప్రారంభమైంది. ప్రతినెలా ఈఎంఐల చెల్లింపు, ఇతర అవసరాల కోసం ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో సీఎం మాటలు నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత ఉంది. అప్పులు తెచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. ఈపరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులను ప్రజలకు చెప్పడం మినహా మరో మార్గం లేదనే తలంపుతో రేవంత్ సర్కారు ఉంది. ఒకవేళ ఏదైనా ఆర్థిక వెసులుబాటు కలిగి పెండింగ్ బిల్లులు చెల్లిద్దామంటే, అవి భారీగా ఉన్నాయనే భావనలో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నారు.
పీఆర్సీ, బకాయిలు అనుమానమే..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES