– ఆ విధానాలు కార్పొరేట్లకే అనుకూలం
– ప్రపంచశాంతికి వ్యతిరేకం : యూటీఎఫ్ నేత రామిరెడ్డి
– స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
– రామిరెడ్డి జీవితం ఆదర్శనీయం : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తన గుత్తాధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకే అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచశాంతి ప్రవచనాలు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కార్పొరేట్లకే ఉపయోగపడతాయే తప్ప ప్రపంచశాంతికి తోడ్పడవని ఆయన తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నాయకులు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటీఎఫ్) ఉద్యమ నిర్మాణంలో ప్రముఖులు, యూటీఎఫ్ ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”ట్రంప్ సృష్టిస్తున్న నూతన ప్రపంచం ఎలా ఉండనుంది..?” అనే అంశంపై నాగేశ్వర్ స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ రామిరెడ్డి గొప్ప మానవ తావాది అనీ, ఆదర్శ ఎమ్మెల్సీ అని కొనియాడారు. ఆయనతో కలిసి పని చేసిన అనుభవం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు.అనంతరం ట్రంప్ విధానాలపై నాగేశ్వర్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం సందర్భంగా రష్యా ఏకాకి అవుతుందంటూ అమెరికా చేసిన అంచనా తప్పిందని అన్నారు. రూబుల్ విలువ పడిపోతుందని, రష్యాలో ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తుతుందనేది వాస్తవంలో తేలిపోయిందని వివరించారు. ఉక్రెయిన్‌ను సగానికిపైగా రష్యా ఆక్రమించడంతో ట్రంప్, యుద్ధం విరమించాలనీ, శాంతిని ప్రేమించాలంటూ కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారని తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగితే రష్యా-చైనాకు మరింత దగ్గరవుతుందని భావనతోనే ఆయన యుద్ధం ఆపాలని కోరుతున్నారే తప్ప శాంతి కోసం కాదని వివరించారు. చైనాను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు ట్రంప్ రష్యాకు దగ్గరవుతున్నారనే తప్ప శాంతి కోసం కాదని అభిప్రాయపడ్డారు. ట్రంప్ చర్యలన్నీ కేవలం అమెరికాను అగ్రరాజ్యంగా కొనసాగించేందుకే తోడ్పతున్నాయని తెలిపారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో పెద్ద ఎత్తున దోచుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ రకంగా ప్రపంచ దేశాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని వివరించారు. అమెరికాలో ఉన్న కొంత మంది పెట్టుబడిదారులతో ఏకమై అగ్రరాజ్య ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నేటి ప్రపంచ ఆర్థిక విధానం డాలర్‌తో మాత్రమే ముడిపడి ఉందన్నారు. భవిష్యత్తులో ట్రంప్ విధానాలు ఇదేవిధంగా కొనసాగితే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని దేశాలు కలిసి అమెరికాకు ప్రత్యామ్నాయంగా కూటములుగా ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రామిరెడ్డి జీవితం ఎంతో ఆదర్శప్రాయమైందని చెప్పారు. ఆయన ప్రతీ అంశంపై సాధికారత సాధించాలనే స్ఫూర్తినిచ్చిన నాయకుడు అని కొనియాడారు.. అవసరమైన సందర్భంలో పని చిన్నదా? పెద్దదా ? అని కాకుండా, చేయడానికి సిద్ధపడాలనే తపన కలిగిన నాయకుడు అని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, జాతీయస్థాయిలో ఎస్టీఎఫ్‌ఐని ఏర్పాటు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. రామిరెడ్డి స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు అంకితం కావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దాచూరి అమరత్వాన్ని ఆవిష్కరిస్తూ, ఆయన దారెంట నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు అంకితం అవుదామని పిలుపునిచ్చారు. ”మరణం విలువైన జీవితానికి గుర్తింపు” అది రామిరెడ్డి పని తీరులో ఇప్పటికీ ప్రస్ఫుటం అవుతుందని కొనియాడారు. ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సంయుక్త మాట్లాడుతూ రామిరెడ్డి మానవీయ సంబంధాలను ఎలా కలిగి ఉండాలో నేర్పిన ఉపాధ్యాయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎం.నరహరి, టీఏపీఆర్‌ఎ రాష్ట్ర అధ్యక్షులు పి.కృష్ణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వెంకట్, ఉపాధ్యక్షులు కే.జంగయ్య, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రిక ప్రధాన సంపాదకులు పి.మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం రాజశేఖర్ రెడ్డి, కే.సోమశేఖర్, బి. సమ్మారావు, ఎస్.రవి ప్రసాద్ గౌడ్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, బి. రాజు, కె.రవి కుమార్, జి.శ్రీధర్, ఏ.సింహాచలం, వై.జ్ఞాన మంజరి, జి.యాకయ్య , ఎస్.వై.కొండలరావు, జి.వి.నాగమల్లేశ్వరరావు, ఆయా జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ట్రంప్ శాంతి మాటలు గుత్తాధిపత్యానికే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES