– పొరుగుదేశాలు నేపాల్, శ్రీలంక, బంగ్లాల కంటే దిగువే..!
– మొదటి మూడు స్థానాల్లో నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్
– రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ర్యాంకింగ్స్
– భారత్‌లోని మీడియా పరిస్థితిపై ఆందోళన
న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత్ వెనకబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో భారత్ 151వ స్థానంలో ఉన్నది. ఇది పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల కంటే దిగువ స్థానంలో ఉండటం గమనార్హం. మీడియా వాచ్‌డాగ్ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఈ విషయాన్ని తెలిపింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అని పిలవబడే ప్రభుత్వేతర సంస్థ 2002 నుంచి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికను ప్రచురిస్తోంది. రాజకీయ, ఆర్థిక, శాసన, సామాజిక, భద్రత అనే ఐదు సూచికల ఆధారంగా ఆయా దేశాలలో పత్రికా స్వేచ్ఛను అంచనా వేస్తోంది. దీని ప్రకారం.. 2024లో భారత ర్యాంకు 159గా, 2023లో 161గా ఉన్నది. ఈ సారి ర్యాంకు కాస్త మెరుగుపడినా.. అది ఆశించినంత స్థాయి కాదనేది విశ్లేషకుల అభిప్రాయం. పత్రికా స్వేచ్ఛా సూచీలో భారత ప్రదర్శన ‘చాలా తీవ్రమైన’ వర్గంలోనే ఉన్నదని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వివరించింది. రాజకీయ దిగ్గజాల చేతుల్లో మీడియా యాజమాన్యం కేంద్రీకృతమై ఉన్న కారణంగా మీడియా బహుళత్వానికి ముప్పు వాటిల్లుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నది. అలాగే, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ స్థితిని మొదటిసారిగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు సూచిక వర్గీకరించింది. ఆర్థిక ఒత్తిడే మీడియా బలహీనపడటానికి దోహదపడే ప్రధాన అంశమని సదరు సంస్థ వివరించింది.
భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు పత్రికా స్వేచ్ఛలో మనకంటే మంచి స్థానాల్లోనే ఉండటం గమనార్హం. నేపాల్ (90వ స్థానం), మాల్దీవులు (104), శ్రీలంక (139), బంగ్లాదేశ్ (149)ల కంటే భారత్ దిగువ స్థానంలో ఉన్నది. భూటాన్ (152), పాకిస్తాన్(158), మయన్మార్ (169), ఆఫ్ఘనిస్తాన్ (175)లు భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. ఇక నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ లేదని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఎడిటోరియల్ డైరెక్టర్ అన్నే బోకాండే అన్నారు. వార్తా మాధ్యమాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాణ్యమైన నివేదికలను ఫణంగా పెట్టి ప్రేక్షకులను ఆకర్షించే పోటీలోకి దిగుతాయనీ, వారిని దోపిడీ చేయటానికి ప్రయత్నించే సామ్రాజ్యవాదులు, ప్రభుత్వ అధికారులకు బలైపోవచ్చని బోకాండే చెప్పారు.
అనధికారిక అత్యవసర పరిస్థితిలో భారత మీడియా
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపింది. 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ మీడియా ‘అనధికారిక అత్యవసర పరిస్థితి’లోకి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీ, మీడియాలో ఆధిపత్యం చెలాయించే పెద్ద కుటుంబాల మధ్య అద్భుతమైన సయోధ్యను రూపొందించిందని భారత్‌పై తన విభాగంలో వివరించటం గమనార్హం.
అంబానీ, అదానీ రాక.. ప్రధాన స్రవంతి మీడియా బహుళత్వానికి ముగింపు
భారత్‌కు చెందిన సంపన్న పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ 70కి పైగా మీడియా సంస్థలను కలిగి ఉన్నాడనీ, వాటిని కనీసం 80 కోట్ల మంది భారతీయులు అనుసరిస్తున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ నివేదిక పేర్కొన్నది. అంబానీని ప్రధాని మోడీకి ‘సన్నిహిత స్నేహితుడు’గా అభివర్ణించింది. ఇక భారత్‌లోని ప్రముఖ ఆంగ్ల వార్తా ఛానెల్ ఎన్డీటీవీని.. అదానీ చేజిక్కించుకున్న విషయాన్నీ ఇది ప్రస్తావించింది. 2022లో అదానీ గ్రూపు ఎన్డీటీవీని కొనుగోలు చేయటం ‘ప్రధాన స్రవంతి మీడియాలో బహుళత్వానికి ముగింపు’ని సూచిస్తుందని వివరించింది. అదానీ కూడా మోడీకి సన్నిహితుడిగా పరిగణించబడుతున్నాడని పేర్కొన్నది.
‘గోడీ మీడియా’ సంస్థల పెరుగుదల
ఇక ‘గోడీ మీడియా’గా పిలవబడే బీజేపీ అనుకూల ప్రచారాన్ని చేసే మీడియా సంస్థలూ పెరిగాయని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొన్నది. మీడియా విషయంలో ప్రధాని మోడీ తీరునూ వివరించింది. ”ప్రధాని పత్రికా సమావేశాలు నిర్వహించరు. తనకు అనుకూలంగా ఉండే జర్నలిస్టులకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. విధేయత చూపని వారిని తీవ్రంగా విమర్శిస్తారు” అని నివేదిక పేర్కొన్నది. ఇక మోడీ సర్కారును విమర్శించే భారతీయ జర్నలిస్టులు బీజేపీ అనుకూల వర్గాల ట్రోల్స్ ద్వారా వేధింపులను ఎదుర్కొన్నారని కూడా నివేదిక వివరించటం గమనార్హం.
పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌కు 151వ స్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES