నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి పుణెలో చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ఓ విద్యార్థిని రెండేండ్ల క్రితం బీజే మెడికల్ ప్రభుత్వ కాలేజీలో చేరారు. ప్రస్తుతం ఆమె సెకండియర్ చదువుతున్నారు. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి తను ఉంటున్న హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఉరేసుకున్న విషయాన్ని గమనించిన తోటి విద్యార్థినులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది. స్కూల్ డేస్ నుంచి తాను సైక్రియాటిక్ ట్రీట్‌మెంట్ పొందుతున్నట్లు పేర్కొన్నారు. చదువుకోవాలనే ఆశ ఉందని సూసైడ్ నోట్‌లో ఆమె పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు పోలీసులు చేరవేశారు.