Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅధ్వానంగా భద్రాచలం- వెంకటాపురం రోడ్డు

అధ్వానంగా భద్రాచలం- వెంకటాపురం రోడ్డు

- Advertisement -

మొద్దు నిద్రలో ఎమ్మెల్యే
ప్రజా సమస్యలపై
సీపీఐ(ఎం) పోరాటం
మండల బంద్‌ సక్సెస్‌ :
జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ
నవతెనంగాణ-వెంకటాపురం

భద్రాచలం నుంచి వెంకటాపురం ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగుకో గుంతతో ప్రధాన రహదారి ఛిద్రంగా తయారైంది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మొద్దు నిద్ర కారణంగా రోడ్డు మరమ్మతులకు నిధులు తెప్పించ లేకపోతున్నారు. రాళ్ళవాగు కుంగిపోయి మూడు నెలలు అవుతున్నా.. భద్రాచలం నుంచి వెంకటాపురానికి బస్సు సౌకర్యం నిలిచిపోయినా ఎమ్మెల్యేకు చలనం లేకుండా పోయింది. రోడ్డు మరమ్మతులకు రూ.100 కోట్లు కేటాయించాలని, రాళ్లవాగుపై కుంగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసి రవాణా సౌకర్యం మెరుగుపరచాలని బుధవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు మండలంలో విశేష స్పందన లభించింది. దుకాణాలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. పెట్రోల్‌ బంక్‌లు, బ్యాంకులు, పాఠశాలలు మూతపడ్డాయి. మండల కేంద్రంతోపాటు, సూరవీడు, అలుబాక, అంకన్నగూడెం, వెంకటాపురంలో సంపూర్ణ బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ మాట్లాడుతూ.. 10 రోజులుగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రోడ్ల సమస్యపై నిరంతర పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే ఈరోజు మండల బంద్‌ నిర్వహించినట్టు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించారని, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ వెళ్లడానికి కూడా దారి లేక పేషెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అయినా నియోజకవర్గ ఎమ్మెల్యేకు చీమకుట్టినట్టయినా లేదని అన్నారు. గత నెల రోజులుగా భద్రాచలం నుంచి బస్సులు రాక ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే ఆటోల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. హనుమకొండ నుంచి వచ్చే సర్వీస్‌లను యాకన్న గూడెం వరకు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఏజెన్సీ ఖనిజ సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో కనీసం 10శాతం కూడా వారి అభివృద్ధికి ఖర్చు చేయడం లేదన్నారు. జిల్లా మంత్రి సీతక్క నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రులు పొంగులేటి, తుమ్మల ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇసుక లారీలను నియంత్రించి, రోడ్డు మరమ్మతులకు కేటాయించే వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గ్యానం వాసు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘుపతి, నాయకులు కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహాచారి, వంకా రాములు, చిట్టెం ఆదినారాయణ, తోట నాగేశ్వరరావు, బొగట విజరు, బొగటా సాంబశివరావు, గుండమ్మల ప్రసాద్‌, జజ్జరి దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img