Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప్రాజెక్ట్‌ పనుల పురోగతికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

ప్రాజెక్ట్‌ పనుల పురోగతికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

- Advertisement -

– అటవీ అనుమతులపై తక్షణం స్పందించాలి : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో రోడ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ప్రాజెక్ట్‌ పనులు వేగంగా పూర్తి చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సరైన ప్రణాళికలతో వెళ్లేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పనుల పురోగతి పర్యవేక్షణకే ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌, ఆర్‌ అండ్‌ బీ స్పెషల్‌ సీఎస్‌, సీసీఎల్‌ఏ కమిషనర్‌, విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మైన్స్‌, జియాలజీ, పీసీసీఎఫ్‌ ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పని చేయనుంది.

విద్యుత్‌ లైన్ల షిఫ్టింగ్‌, వాటర్‌ యుటిలిటీ క్లియరెన్స్‌, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ సంబంధిత అంశాలపై గురువారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా మూడు గంటల పాటు మంత్రి అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి వరంగల్‌ – ఖమ్మం సెక్షన్‌లో ఎన్‌హెచ్‌ 163జీ పరిధిలోని ప్యాకేజీ 2లో చెరువుల అంశాన్ని మంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ఎన్‌హెచ్‌ అధికారులు వివరించారు. మహబూబాబాద్‌, నెల్లికుదురు ప్రాంతంలో చెరువుల సమస్యలతోపాటు హై లెవల్‌ బ్రిడ్జిని ప్రతిపాదించారు. నీటిపారుదల నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉందని అన్నారు. ఎన్‌హెచ్‌ 30 సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు రోడ్డుతోపాటు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే రోడ్డుకు సంబంధించి పలు సమస్యలు మంత్రి దష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి ఇరిగేషన్‌ శాఖ ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రత్యేక చొరవ తీసుకుని మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అటవీ అనుమతులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా మంత్రి దష్టికి తెచ్చారు.

ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులు 2 ఉంటే అందులో 6 ప్రాజెక్టులు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌లేక పెండింగ్‌లో ఉన్నాయని వివరిం చారు. కల్వకుర్తి – శ్రీశైలం 62 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌కు కేంద్ర మంత్రి గడ్కరీ సానుకూలంగా ఉన్నారనీ, ఫారెస్ట్‌ అధికారులు అందుకు తగ్గట్టుగా సమన్వయంతో పనిచేస్తే గొప్ప ప్రాజెక్ట్‌ పూర్తి చేసినట్టవుతుందన్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించి 220కెవి, 400కెవి లైన్‌ సమస్యలతోపాటు, 33కెవి, 11కెవి లైన్‌ షిఫ్టింగ్‌ సమస్యలున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. ఏ ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో వివరాలు ఇవ్వాలనీ, వాటిని పరిష్కరించేందుకు విద్యుత్‌ శాఖ అధికారి ముషారఫ్‌ ఆలీకి బాధ్యతలు అప్పగించారు. మైనింగ్‌ శాఖ నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందన్నారు. ప్రధానంగా భూసేకరణలో భాగంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఈనెల 18న మరోమారు భేటీ అవుదామన్నారు.

ఆయా జిల్లా కలెక్టర్లు హాజరయ్యేలా చూడాలని మంత్రి చెప్పారు. తర్వాత మీటింగ్‌కు ఇప్పుడు వచ్చిన అంశాలపై క్లారిటీ వచ్చేలా సంబంధిత కలెక్టర్లు, ఆర్డీవోలను తను కో ఆర్డినేట్‌ చేస్తానని తెలిపారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారమనీ, రెండు మూడు నెలల్లో పనులు ప్రారంభించాలానే చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తర భాగం భూసేకరణ దాదాపు పూర్తి అయిందన్నారు. ఆరు లేన్లుగా అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని అన్నారు. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉన్న చిన్న సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. భూ పరిహారం చెల్లింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టుల క్లియరెన్స్‌ కోసం త్వరలో ప్రధాని మోడీని కలుస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad