న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో 25పుస్తకాలను నిషేధిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సెన్సార్‌షిప్ నిరంకుశత్వానికి మరో వ్యక్తీక రణ అని, భావ ప్రకటనా స్వేచ్ఛపై దారుణంగా దాడి చేయడమేనని విమర్శించింది.ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న లెప్టినెంట్ గవర్నర్ భారత రాజ్యాంగం హామీ కల్పించిన ప్రాధమిక హక్కు లను చాలా తీవ్రంగా కత్తిరించేస్తున్నారు. ‘వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి’ ప్రోత్సాహాన్నిస్తున్నాయనే సాకుతో కాశ్మీర్ చరిత్రను ప్రస్తుత సమస్యల మూలాలను అన్వేషించే 25 పుస్తకాలను ప్రభుత్వం నిషేధించింది. నిషేధానికి గురైన పుస్తకాల్లో ఎ.జి.నూరాని, అనురాధా భాసిన్, అరుంధతి రారు వంటి ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలు వున్నాయి. తక్షణమే ఆ పుస్తకాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది. ఇక ఎలాంటి జాప్యం చేయకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని, దానితో పాటు పూర్తిస్థాయిలో ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలి. ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి స్థాయి పాలనాపరమైన అధికారాలు కల్పించాలి. అటువంటి చర్యల ద్వారా మాత్రమే జమ్మూ కాశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలరని పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో పేర్కొంది.