Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం'సర్‌' ప్రక్రియ సరికాదు

‘సర్‌’ ప్రక్రియ సరికాదు

- Advertisement -

– దేశంలో వెనుకబడిన వర్గాల వాణిని అడ్డుకునే ప్రయత్నం
– ప్రమాదకరమైన చర్య : నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌

దేశంలో వెనుకబడిన వర్గాల వాణిని అడ్డుకునే ప్రయత్నం :నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌
న్యూఢిల్లీ :
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ తప్పుపట్టారు. కొందరి గొంతుకను…ముఖ్యంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారి వాణిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం సరికాదని చెప్పారు. ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఈ-మెయిల్‌ ఇంటర్వ్యూలో అమర్త్య సేన్‌ ‘సర్‌’పై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలు…
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) చేపట్టాలన్న ఎన్నికల కమిషన్‌ ప్రయత్నాన్ని మీరు సమర్ధిస్తారా?
జాబితాలను సరిచేయడం నిజంగా మంచి కసరత్తే అవుతుంది. అయితే దానిని సరిగా నిర్వహించాలి. ప్రస్తుత జాబితాలలోని తప్పులను తొలగించడానికి తొందరపాటుతో ప్రయత్నాలు జరిపితే, ఆ క్రమంలో మరిన్ని తప్పులు చేస్తే ఫలితం భయానకంగా ఉంటుంది. తక్కువ సమయంలో, పక్షపాత ధోరణితో ఈ ప్రయత్నాన్ని చేపడితే ఎన్నికలు నిజాయితీగా జరగవు. దానికంటే ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలతోనే ఎన్నికలు నిర్వహించడం మేలు. చాలా మంది ఎన్నికల సంఘం యొక్క తటస్థతను ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా సరిగా అంచనా వేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్‌ నిస్పాక్షికంగా వ్యవహరించినప్పటికీ తొందరపాటుతో రూపొందించే ఓటర్ల జాబితాలలో తప్పులు ఉండవచ్చు. చాలా మంది పౌరులు…ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల వారి వద్ద సరైన పత్రాలు లేకపోవచ్చు. ఇక్కడ వర్గ పక్షపాతం అనేది చాలా పెద్ద ప్రమాదకారి.
చాలా తక్కువ సమయంలో, తొందరపాటుతో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియలో పెద్ద సమూహాలకు చెందిన వారు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదా?
కొంతమంది పౌరుల గొంతును…ముఖ్యంగా దేశంలో అభివృద్ధికి నోచుకోని అట్టడుగు ప్రాంతాలకు చెందిన వారి గళాన్ని అడ్డుకునే లక్ష్యంతో ప్రయత్నం జరిగితే అది భయంకరమైన పరిణామం అవుతుంది. దీనిని పూర్తిగా నివారించాలి. నిస్పాక్షిక విమర్శకుల అనుమానాలకు గల కారణాలను ఎన్నికల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల కమిషన్‌ ప్రాధాన్యతలు అనుమానాలు రేకెత్తడానికి కారణం కాకూడదు. సుప్రీంకోర్టు తన పర్యవేక్షక పాత్రను క్రియాశీలకంగా, న్యాయంగా నిర్వర్తించాలి. నిజానికి పౌరుల హక్కులు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూసుకోవాల్సిన అత్యంత బాధ్యత కలిగిన సంస్థ సుప్రీంకోర్టే. భారత పౌరులుగా మనమందరం సుప్రీంకోర్టు నిర్వహించే రాజ్యాంగ పాత్రపై ఆధారపడాలి.
వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్‌ శాసనసభకు ఎన్నికలు జరగనున్నందున దానికి సన్నాహకంగా హిందూత్వను ముందుకు తీసుకుపోయేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ ప్రయత్నంలో వారు విజయం సాధిస్తారా?
బెంగాల్‌లో హిందూ-ముస్లింల మధ్య సుహృద్భావానికి, వివిధ సమాజాల మధ్య సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. మతపరమైన సంకుచితత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీ తాత్కాలికంగా తన విభజన యత్నాల ద్వారా పాక్షిక విజయాన్ని పొందవచ్చు. అయితే బెంగాల్‌ను మతపరంగా విభజించడం, ప్రజల్లో ద్వేషాన్ని నింపడం అంత సులభం కాదు. ఈ రకమైన విభజన ప్రయత్నాలు కొన్నిసార్లు స్వల్పకాలిక విజయాలు సాధించవచ్చు. కానీ బెంగాల్‌ సంస్కృతి, సమాజం అంతర్గత శతృత్వాన్ని సృష్టించడాన్ని ప్రతిఘటిస్తాయి. అసమ్మతి ద్వారా పొందిన రాజకీయ లబ్ది ఏమైనా ఉంటే అది అశాశ్వతమవుతుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేద బెంగాలీ వలస కార్మికులపై జరుగుతున్న వేధింపుల గురించి మీరు ఏమంటారు?
ఇక్కడ ఒక సాధారణ అంశాన్ని, ఆందోళన కలిగించే మరో అంశాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సాధారణ అంశం ఏమిటంటే దేశంలో నివసించే వారందరూ భారత పౌరులే. దేశంలోని ఏ భాగాన్ని అయినా…బెంగాల్‌ అయినా, తమిళనాడైనా, మహారాష్ట్ర అయినా వివక్షతో చూడకూడదు. ఇతర ప్రాంతాలలో బెంగాలీ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం చాలా చెడ్డ పని. అలాగే వలస కార్మికులు ఇతర సమూహాల పట్ల దురుసుగా ప్రవర్తించినా అంతే. ఇది సాధారణమైన విషయం. దేశంలో కొన్ని రాజకీయ ఉద్యమాలు బెంగాలీ భారతీయులను బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారుగా చిత్రీకరించాయి. దురదృష్టవశాత్తూ బెంగాలీలను బంగ్లాదేశీయులుగా పరిగణించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా దేశంలోని కొన్ని రాజకీయ సమూహాల ముస్లిం వ్యతిరేక కార్యక్రమాల కారణంగా బెంగాలీ భారతీయులు తరచుగా ఇతర భారతీయుల కంటే ఎక్కువ వివక్షకు గురవుతున్నారు. ఢిల్లీలో చాలా మంది పలుకుబడిన అధికారులు బెంగాలీ భాషను (పదవ, పదకొండవ శతాబ్దాల మధ్య జన్మించిన వారు-గొప్ప కవిత్వం చర్యాపాద్‌ ద్వారా) బంగ్లాదేశ్‌ భాషగా చూసినప్పుడు వారి అజ్ఞానం బయటపడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img