– నిలిచిపోతున్న నిర్మాణాలు తలకు మించిన భారంగా సర్కారు షరతుల
– బేస్‌మెంట్ నిర్మాణానికే రూ.2 లక్షల వ్యయం
– ముందు పెట్టుబడి పెట్టే స్థోమతలేని పేదలు
– అమల్లోకి రాని రూ.2 లక్షల డ్వాక్రా సంఘాల రుణాలు
– 45 రోజుల గడువు.. 600 చదరపు అడుగుల్లో నిర్మాణమంటూ ఆంక్షలు
– లేకుంటే రద్దు చేస్తామని హెచ్చరికలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
‘ఇందిరమ్మ’ పథకం కింద ఇండ్లు కట్టుకునేందుకు లబ్దిదారులు డబ్బుల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అర్హతలు ఉండి ఇండ్లు మంజూరైనా పునాదులు తీసేందుకు కూడా డబ్బులు లేక ఎంతోమంది వాటిని వదిలేసుకుంటున్న పరిస్థితులు గ్రామీణంలో కనిపిస్తున్నాయి. ఇండ్లులేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో అర్హుల్ని గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. ఆర్థిక స్థోమతలేని పేదలు పెరిగిన నిర్మాణ వ్యయంతో ముందస్తు పెట్టుబడులు పెట్టుకోలేక కుదేలవుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో పునాది తవ్వకం, బేస్‌మెంట్ నిర్మాణం, మట్టి పనులకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. అంతసొమ్ము పేద లబ్దిదారుల వద్ద లేదు. అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేసినా బిల్లులు రాకపోతే వీధిన పడతామనే భయం వారిని వెంటాడుతోంది. పేద లబ్ది దారులకు ఇంటి నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ద్వారా రూ.2 లక్షల వరకు రుణాలిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులు కాని వాళ్లకు రుణాలిచ్చే అవకాశమూ లేదు. దీనివల్ల చాలా మంది లబ్దిదారులు తాము ఇంటిని కట్టుకోలేకపోతు న్నామనీ, ప్రభుత్వమే ఇంటిని కట్టించాలని కోరుతున్నారు. పైగా 600 చదరపు అడుగుల స్థలంలో, 45 రోజుల గడువులో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని, లేదంటే రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చేతులెత్తేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. వాటిలో ఇప్పటికే 3 లక్షల ఇండ్లను మంజూరు చేసి లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసింది. రాష్ట్రంలో 80.05 లక్షల మంది పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేశారు. దరఖాస్తుల్ని పరిశీలించిన ప్రభుత్వం 77.19 లక్షల మందిని అర్హులుగా గుర్తించి యాప్‌లో అప్‌లోడ్ చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో 7,53,668 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేశారు. వీటిని పరిశీలించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున 40,555 ఇండ్లను మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 16,555, మెదక్ జిల్లాలో 9000, సిద్దిపేట జిల్లాలో 15,000 ఇండ్లను మంజూరు చేశారు. మిగతా వాళ్లకు దశల వారీగా మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. లబ్దిదారులకు ఇండ్లను మంజూరు చేసే ప్రక్రియ జరిగినప్పటికీ ఇండ్ల నిర్మాణం మాత్రం ముందుకు సాగట్లేదు. ముందస్తుగా లబ్దిదారులే సొంత డబ్బులతో బేస్‌మెంట్ లెవల్ వరకు నిర్మాణం చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం బిల్లు చెల్తిస్తుంది. దాంతో ఆర్థిక స్థొమతలేని పేద లబ్దిదారులు ఇంటి నిర్మాణ పనుల్ని మొదలు పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందించాలని కోరుతున్నారు.
క్షేత్ర స్థాయిలో ‘నవతెలంగాణ’ పరిశీలన..
చౌటకూర్ మండల కేంద్ర గ్రామంలో 26 ఇండ్లు మంజూరు కాగా, 18 మంది లబ్దిదారులు మాత్రమే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇందులో 11 బేస్‌మెంట్ లెవల్‌లో ఉండగా 5 మాత్రం లెంటల్ లెవల్‌లో, మరో 2 స్లాబ్ లెవల్‌లో ఉన్నాయి. మరో 8 మంది లబ్దిదారులు పైసల్లేక నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఆ 8 మంది లబ్దిదారులు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నామన్న విషయాన్ని రాత పూర్వకంగా తెలపాలని అధికారులు చెబుతున్నారు. సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో 50 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో 24 మాత్రమే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 11 ఇండ్ల నిర్మాణ పనులు ఇంత వరకు ప్రారంభించలేదు. మరో 15 మంది లబ్దిదారులు మేం ఇండ్లు కట్టుకోలేకపోతున్నామని పంచాయతీ కార్యదర్శికి చెప్పారు. ఏటిగడ్డసంఘం గ్రామంలో 34 ఇండ్లు మంజూరవ్వగా 7 ఇండ్ల నిర్మాణం కోసం మార్కింగ్ చేయగా 6 చోట్ల మాత్రమే పనులు జరుగుతున్నాయి. రెండు ఇండ్లకు బేస్‌మెంట్ లెవల్లో బిల్లులిచ్చారు. మిగతా ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టలేదు. నలుగురు లబ్దిదారులు డబ్బుల్లేనందున ఇంటి నిర్మాణం తమ వల్ల కాదని చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 15 వేల ఇండ్లు మంజూరు చేశారు. వీటిల్లోనూ 6 వేల ఇండ్ల నిర్మాణం ఇప్పటికీ మొదలుకాలేదు. రాయపోల్ మండలంలోని రామారంలో 183 ఇండ్లు మంజూరవ్వగా 17 చోట్ల మాత్రమే పనులు నడుస్తున్నాయి. 90 మంది లబ్దిదారులు ఇంటి నిర్మాణం చేపట్టలేమని తేల్చి చెప్పారు. మరో 76 మంది లబ్దిదారులు పునాది తవ్వే పనులు ఇంకా మొదలుపెట్టలేదు. చిన్నకోడూరు మండల కేంద్రంలో 521 ఇండ్లు మంజూరవ్వగా, 300 ఇండ్లు మాత్రమే నిర్మాణమవుతున్నాయి. 221 ఇండ్ల నిర్మాణ పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు. మెదక్ జిల్లాలోనూ 9 వేల ఇండ్లను మంజూరు చేయగా వీటిల్లో 3,500 వరకు పనులు మొదలు పెట్టలేదు.
అలవిగాని ఆంక్షలు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలవిగాని ఆంక్షలు పెట్టింది. 600 చదరపు అడుగుల్లోనే ఇంటిని కట్టుకోవాలని చెప్పడం వల్ల పెద్ద కుటుంబం ఉన్న వాళ్లు ఇష్టపడట్లేదు. 45 రోజుల వ్యవధిలోనే స్లాబ్ పడిపోవాలని, లేదంటే బిల్లులు మంజూరవ్వబోవని చెబుతున్నారు. గ్రామాల్లో మేస్త్రీలు, ఇసుక, మట్టి లభించట్లేదు. సిమెంట్, ఐరన్ ధరలు పెరగడం వల్ల ఇబ్బందులున్నాయి. మరో పక్క ఆగస్టులోపు నిర్మాణ పనుల్ని ప్రారంభించకపోతే ఇంటిని రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తక్కువ సమయంలో లక్షలు తెచ్చి ఎట్లా నిర్మాణ పనులు చేపడతామని బైరు జయమ్మ, గొల్ల విజయలక్ష్మి, బూడిద బూమయ్య, ఎంకపల్లి హైమద్, పెద్దగొల్ల రాములు ‘నవతెలంగాణ’తో తమ గోడును చెప్పుకున్నారు. డ్వాక్రా సంఘం నుంచి ప్రతి లబ్దిదారునికి రూ.2 లక్షల ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రారంభమే కాని 25 శాతం ఇండ్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటి వరకు 25 శాతం వరకు నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. సంగారెడ్డి జిల్లాకు 16,555 ఇండ్లు కేటాయించగా అందులో 14,529 ఇండ్లను మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 6,450 ఇండ్లకు మార్కింగ్ చేశారు. 1,850 ఇండ్లు బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నాయి. 120 ఇండ్ల నిర్మాణం రూఫ్ లెవల్‌లో ఉండగా మరో 50 ఇండ్లు స్లాబ్ లెవల్‌లో ఉన్నాయి. మంజూరైన ఇండ్లల్లో కేవలం 8470 మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 5737 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. వీరిలో 3,791 మంది లబ్దిదారులు ఆర్థిక స్థోమత బాగలేక ఇండ్ల నిర్మాణానికి ఆసక్తి చూపట్లేదని గృహ నిర్మాణ శాఖ గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మకు పైసల కష్టాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES