- వైట్ హౌస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు
నవతెలంగాణ హైదరాబాద్: ఎప్పుడు సూటు, బూటు వేసుకొని దర్జాగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇవాళ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన క్రైస్తవ మతపెద్ద ‘పోప్’ అవతారమెత్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటోను ఏఐ ద్వారా రూపొందించినట్టు తెలుస్తోంది. అందులో ట్రంప్ పోప్ దుస్తులు ధరించి కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పోప్ ట్రంప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
క్యాథలిక్ క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లోనూ ట్రంప్ పాల్గొన్నారు. అయితే ఓ టీవీ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాను పోప్ కావాలనుకుంటున్నానని, అదే తన నెంబర్ వన్ ఛాయిస్ అంటూ జోక్ వేశారు. అధ్యక్షుడి వ్యాఖ్యల నేపథ్యంలో ‘పోప్ ట్రంప్’ ఫొటో బయటకు వచ్చింది. ఈ పొటోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణాన్ని ట్రంప్ అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.