3 నెలలకోసారి ఫలితాలపై సమీక్ష
క్రీడా స్కూళ్లు, అకాడమీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు : క్రీడలపై సమీక్షలో మంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు పతకాలు సాధించే కర్మగారాలుగా మారాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థుల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శాట్స్ చైర్మెన్ శివసేనారెడ్డితో కలిసి మంత్రి శ్రీహరి రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లు, అకాడమీల పనితీరు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరగాలని అధికారులను ఆదేశించారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్ స్కూళ్లలో ఆధునిక క్రీడా శిక్షణ, విద్యలో మెరుగుదల సాధించాలని సూచించారు. హకీంపేట్‌లో తక్షణ మరమ్మతులు, అన్ని స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ అథారిటీ అకాడమీల పనితీరు మెరుగుపరిచి క్రీడాకారుల్లో స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీల్లో త్రైమాసికంగా బ్యాటరీ టెస్టులు నిర్వహించి, కంప్యూటరైజ్డ్ రిపోర్టులు తయారుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
క్రీడా ప్రతిభ లేని వారిని గురుకులాలకు బదిలీ చేయాలి
ప్రతిభ ఆధారంగా విద్యార్థుల వర్గీకరణ (ఎ-ఎఫ్) చేసి క్రీడా ప్రతిభ లేని వారిని ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థలకు బదిలీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి శ్రీహరి ఆదేశించారు. స్పోర్ట్స్ స్కూల్లో పనిచేసే అధికారులు సిబ్బంది విద్యార్థుల సంక్షేమం కోసం వారి పిల్లలుగా చూసుకోవాలనీ, ఇబ్బందులు రాకుండా వారి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రేరణాత్మక తరగతులు, వ్యక్తిత్వ వికాస అంశాల్లో శిక్షణ యోగ శిక్షణ తప్పనిసరి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు ప్రతి క్రీడా పాఠశాల, అకాడమీలో విద్యార్థుల తల్లిదండ్రుల కోసం సందర్శకుల గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్బీ స్టేడియంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేసి అన్ని అకాడమీలను స్పోర్ట్స్ స్కూళ్లలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఈ కాన్ఫరెన్స్ హాల్‌కు అనుసంధానం చేయాలని కోరారు. క్రమం తప్పకుండా క్రీడా శాఖలోని అన్ని విభాగాలపై నిరంతరం సమీక్షలు చేస్తామన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీల పనితీరు మెరుగుపరచడమే కాకుండా అన్ని అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు అందరి అభిప్రాయాలనూ తీసుకుంటూ సమగ్ర క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు. విధుల్లో అలసత్వం వహించే ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి శ్రీహరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి టి మమత, డిప్యూటీ డైరెక్టర్లు జి చంద్రారెడ్డి, జి రవీందర్, రవి శంకర్ పల్లెల, ఎస్‌ఎం బాషా, జి అశోక్ కుమార్, పి సందీప్ కుమార్, సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.
క్రీడా పాఠశాలలుపతకాలు సాధించే కర్మాగారాలుగా మారాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES