బీహార్ ఎస్‌ఐఆర్ వ్యవస్థీకృత చోరీ
రాజ్యాంగం చేతబూని పార్లమెంట్‌లో ప్రమాణం చేశా : ఈసీ అఫిడవిట్ అడగడంపై రాహుల్‌గాంధీ
బెంగళూరు : తాను విడుదల చేసిన సమాచారం ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ఎన్నికల కమిషన్ తన వెబ్‌సైట్లను మూసివేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ‘ఓట్ అధికార్ ర్యాలీ’లో ఆయన ప్రసంగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్‌లో వైబ్‌సైట్లు మూసివేసిందని తెలిపారు. ఓట్ల చోరీపై తన విమర్శలను ఆయన పునరుద్ఘాటించారు. ‘ప్రమాణం చేసి నా వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం అడుగుతోంది. నేను పార్లమెంట్ లోపల రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేశాను’ అని చెప్పారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఈసీ కలిసి ప్రజల నుంచి ఓట్లను దొంగతనం చేయడానికి కుట్రలు పన్నాయని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో తమ వేదిక విజయం సాధించిందని, నాలుగు నెలల తరువాత జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో నిజానిజాలను వెలికితీయడానికి తాము ప్రయత్నించగా, కొత్తగా కోటి మంది ఓటర్లు నమోదైనట్టు గుర్తించామని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు నమోదైన వీరంతా అంతకుముందు ఎప్పుడూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేదని చెప్పారు. ఈ కొత్త ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయని, ఇది ‘నేరాన్ని’ సూచిస్తుందని అన్నారు. ‘మా వేదిక ఓట్లు తగ్గలేదు. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే అసెంబ్లీకి పడ్డాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు బీజేపీకి ఓటువేశారు’ అని రాహుల్ వివరించారు.
‘మహాదేవపుర’పై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపాలి
గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్‌కు 16 సీట్లు వరకూ వస్తాయని సర్వేలు, ఓపియన్ పోల్స్ చెప్పాయని, కానీ తొమ్మిది స్థానాలే వచ్చాయని తెలిపారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మహాదేవపుర అసెంబ్లీ స్థానంలో 1,00,250 ఓట్లను కొత్తగా చేర్చారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కోసమే ఈ విధంగా చేశారని తెలిపారు. సాఫ్ట్ కాపీ ఓటరు జాబితాను డిమాండ్ చేస్తున్నామని, కానీ ఈసీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ విషయంపై కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయాలని రాహుల్‌గాంధీ కోరారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐదు మార్గాల్లో ఈసీ ఓట్ల దొంగతానికి పాల్పడుతుందని రాహుల్‌గాంధీ విమర్శించారు. బీజేపీ కోసం ఈసీ పనిచేయకూడదని, రాజ్యాంగం కోసం పని చేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని, దేశ పౌరుల హక్కులను పరిరక్షించడం ఎన్నికల కమిషన్ విధి అని తెలిపారు.
బీహార్‌లో ఎస్‌ఐఆర్ ‘వ్యవస్థీకృత చోరీ’
బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఒక ‘సంస్థాగత దొంగతనం’గా రాహుల్ గాంధీ ఆభివర్ణించారు. ‘పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఎన్నికల సంఘం, బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కు అవుతోంది’ అని చెప్పారు. సభలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఐదు ప్రశ్నలకు సమాధానమివ్వండి : ఎక్స్ వేదికగా ప్రశ్నించిన రాహుల్
‘డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాచి పెడుతున్నారు, సీసీ ఫుటేజీని ఎందుకు? ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు, నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు?, ప్రతిపక్షాలను ఈసీ ఎందుకు భయపెడుతోంది?, బీజేపీ ఏజెంట్‌గా ఈసీ మారిపోయిందా? అని ఎక్స్‌వేదికగా రాహుల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో అమూల్యమైనదని అన్నారు.
అభ్యంతరాలు చెప్పడానికి ఆలస్యమెందుకు? : రాహుల్‌కు ఇసి ప్రశ్న
బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ఈ నెల 1న ప్రకటన విడుదల చేసినా.. మార్పులు చేర్పులపై ఇప్పటివరకు ఏ పార్టీ తమను సంప్రదించలేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓట్ల తొలగింపుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ముసాయిదాపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు నమోదు చేయలేదని పేర్కొంది. అభ్యంతరాలు చెప్పడానికి ఆయన ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. తాము విడుదల చేసిన ఓట్ల తొలగింపు ముసాయిదాపై తన అభ్యంతరాలను రాహుల్‌గాంధీ ఇప్పుడు కాకుండా ఎప్పటిలాగే బీహార్ ఎన్నికలు పూర్తయ్యాక ఇస్తారేమోనని ఈసీ వ్యాఖ్యానించింది.
ప్రజలు ప్రశ్నిస్తారని వెబ్‌సైట్లు మూసేశారు
- Advertisement -
- Advertisement -