– ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణపై అధికారులకు ఆదేశాలు
– ఎన్‌జీఆర్‌ఐ పర్యవేక్షణలో ఎలక్ట్రోమాగటిక్ సర్వే
– పనుల్లో జీఎస్‌ఐ భాగస్వామ్యం
– 30 ఏండ్ల తర్వాత ఉద్యోగోన్నతులు : నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పునరుద్ధరణకు రూట్‌మ్యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులతోపాటు ఇతర అనుమతులపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం జరుగుతుందన్నారు.
శుక్రవారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు తిరిగి పనులు చేపట్టాలి. ముఖ్యమైన ప్రాజెక్టు తొమ్మిది కిలోమీటర్ల పనికే నిలిచిపోవడం దురదృష్టకరం. ఎస్‌ఎల్‌బీసీ పూర్తికానందున ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలని ప్రభుత్వ నిర్ణయించింది. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ) సర్వేతో భూగర్భం లోపలి వరకు మ్యాపింగ్ చేయడానికి వీలుంది. కచ్చితమైన ప్రణాళిక కోసం లైడార్ సర్వే కూడా చేస్తాం.” అని మంత్రి చెప్పారు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి హెలికాప్టర్‌తో ఎలక్ట్రోమాగటిక్ జియోఫిజికల్ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, రూ.2.36 కోట్లతో నామినేషన్ పద్ధతిన ఎన్‌జీఆర్‌ఐకి పనులు అప్పగించిందని వివరించారు. జియాలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ)ని కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. సింగూర్ డ్యామ్‌ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సమ్మక్క, సారక్క బ్యారేజీలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో ఛత్తీస్‌గఢ్‌పై చూపే ప్రభావాలమీద ఐఐటీ ఖరగ్‌పూర్ చేసిన అధ్యయనం నివేదిక సర్కారుకు అందింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం లోని తుపాకులగూడెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క, సారక్క బ్యారేజీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నీటిపారుదల శాఖలో 30 ఏండ్ల తర్వాత ఉద్యోగులు ఉద్యోగోన్నతుల ప్రక్రియను పూర్తిచేశామని మంత్రి చెప్పారు. వివిధ స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చినట్టు వివరించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహా దారు ఆదిత్యదాస్ నాద్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, రమేష్‌బాబు, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సీఈ అజరుకుమార్ పాల్గొన్నారు.
రూట్ మ్యాప్‌ను రూపొందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES