– అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడు
– యూఎస్ ఉత్పత్తులపై బ్యాన్ విధించాలి
– అమెరికా కంపెనీలను బారుకాట్ చేయాలి
– ఇంటర్నెట్‌లో భారతీయుల ఆగ్రహం
– ‘ట్రంప్ టారిఫ్’ల వేళ ప్రజల నుంచి వ్యతిరేకత
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై భారతీయుల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నది. భారత్‌తో పాటు ఇతర దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తున్న ఆయన తీరును వారు తప్పుబడుతున్నారు. ఒకప్పుడు ట్రంప్‌నకు మద్దతిచ్చినవారు, అమెరికాకు ఆయనే మళ్లీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారు సైతం ఇప్పుడు ఆయన వద్దంటే వద్దు అని తెగేసి చెప్తున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ వేదికగా పలు సామాజిక మాధ్యమాల్లో ట్రంప్‌నకు, అమెరికా ఉత్పత్తులు, కంపెనీలకు వ్యతిరేకంగా ప్రచారం తీవ్రమైంది. అమెరికా కంపెనీలను బారుకాట్ చేయాలనీ, ట్రంప్ చర్యలను ప్రతిఘటించాలని కొందరు భారతీయులు పిలుపునిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ ఇండియాటుడేకు చెందిన ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (ఓఎస్‌ఐఎన్‌టీ) బృందం నిర్వహించిన విశ్లేషణలో భారత్‌లో ‘ఎక్స్’ వేదికగా ట్రంప్ వ్యతిరేక (యాంటీ ట్రంప్) సెంటిమెంట్ పెరిగిపోయిందని గుర్తించింది. ఇందులో భాగంగా ఈనెల 1 నుంచి 7 మధ్య వచ్చిన పోస్టులను పరిగణలోకి తీసుకున్నది. రష్యా నుంచి చమురు ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో భారత్‌పై ట్రంప్ ఇప్పటికే 25 శాతం సుంకాన్ని విధించారు. పెనాల్టీగా పేర్కొంటూ ఈనెల 28న మరో 25 శాతం టారిఫ్‌ను విధించేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైన విషయం తెలిసిందే.
తాజా విశ్లేషణ ప్రకారం.. భారత్‌పై ఆయన విధించిన టారిఫ్ పెరుగుదల భారతీయుల్లో ఈ ఆగ్రహానికి కారణమైంది. అమెరికా కంపెనీలను టార్గెట్ చేసుకుంటూ వాటిని బారుకాట్ చేయాలన్న క్యాంపెయిన్ ‘ఎక్స్’లో తీవ్రమైంది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారాలే లక్ష్యంగా వాటిని ‘నిషేధించటం(బ్యాన్)’, ‘బారుకాట్’ చేయాలనే కీలక పదాలను కలిగి ఉన్న 47వేలకు పైగా ఎక్స్ పోస్టులు గత ఏడు రోజుల్లో పబ్లిష్ అయ్యాయి. ఇందులో పది వేల వరకు పోస్టులు కోకా-కోలాను బ్యాన్ చేయాలన్నాయి. 9100కు పైగా పోస్టులు మెటాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ను టార్గెట్ చేసుకున్నాయి. స్టార్‌బక్స్‌ను బారుకాట్ చేయాలని 5200కు పైగా పోస్టులు డిమాండ్ చేశాయి. ఇక 2700 పోస్టులు పిజ్జాహట్‌ను, ఐదువేలకు పైగా పోస్టులు కేఎఫ్‌సీని టార్గెట్ చేశాయి. కనీసం పదివేల పోస్టులు ‘బారుకాట్ యూఎస్‌ఏ’, ‘బారుకాట్ యూఎస్’, ‘బారుకాట్ అమెరికా’ అనే కీలక పదాలను కలిగి ఉన్నాయి. ఈనెల 1 నుంచి 7 వరకు (మధ్యాహ్నం 3 గంటల వరకు) భారత్‌లోని ఎక్స్ వినియోగదారులు ఈ పోస్టులను చేశారు. ఆగస్టు 7న భారత్‌పై ట్రంప్ తొలిదశలో విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన విషయం విదితమే.
ఇప్పటికే కెనడా, యూరప్ దేశాల్లో ట్రంప్ తీరుపై ఆగ్రహం
అమెరికా ఉత్పత్తులు, వ్యాపారాలను బహిష్కరించాలంటూ భారత్ నుంచి విస్తృతస్థాయిలో పిలుపులు రావటం బహుశా ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ టారిఫ్ వార్‌పై భారత్ మాత్రమే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలు సైతం ఇదే వైఖరిని అవలంభిస్తున్నాయి.
ఈ ఆగ్రహం కెనడాలో మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు అత్యంత ప్రాచుర్యం కలిగిన అమెరికానో కాఫీని ‘కెనడియానో’గా పేరు మార్చింది. ఇటు యూరప్‌లో సైతం అక్కడి వినియోగదారుల నుంచి యూఎస్ అవలంభిస్తున్న విదేశాంగ విధానంపై ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ క్యాంపెయిన్లు
ట్రంప్ తీరుపై ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఆయనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆన్‌లైన్ క్యాంపెయిన్లలో భాగస్వాములయ్యారు. 1500కు పైగా పోస్టులు ‘ట్రంప్ ఈజ్ అన్‌ఫిట్ ఫర్ ఆఫీస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో, ‘అరెస్ట్ ట్రంప్’ అనే హ్యాష్‌ట్యాగ్, కీలక పదాలతో కూడిన పోస్టులు 1900 ఉన్నాయి. దాదాపు 300 మంది నెటిజన్లు వ్యక్తిగత దూషణలు, అవమానపర్చే పదాలతో 3000కు పైగా పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసుకుంటూ ఇలాంటి పదాలను వినియోగించే ధోరణి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడు రోజుల్లో అంతర్జాతీయంగా 2.84 లక్షలకు పైగా ఎక్స్ పోస్ట్‌లు అలాంటి పదాలను కలిగి ఉన్నాయి.
ట్రంప్ వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES