– మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల
– ఫోన్లు ట్యాపింగ్ చేశారు
– కుట్రదారులు కేసీఆర్, కేటీఆరే..భార్యాభర్తల ఫోన్లూ విన్నారు
– ఇండ్లలో పనిమనుషుల ఫోన్లనూ వదల్లేదు :
– ‘సిట్’ ఎదుట కేంద్రమంత్రి బండి సంజయ్ వాంగ్మూలం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనికి అవసరమైన ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారనీ, అందుకే కేసీఆర్ కుటుంబానికి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’కు ఎలాంటి అధికారాలు లేవనీ, కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు. మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకులు, వ్యాపారులు, సెలెబ్రిటీలు, విద్యావేత్తల ఫోన్లను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఈ కుట్ర పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ల పర్యవేక్షణలోనే సాగిందని స్పష్టం చేశారు. శుక్రవారం దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో సిట్ నిర్వహించిన ఫోన్‌ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారుల ఎదుట ఆయన సుదీర్ఘ వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. వాస్తవానికి మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేయాలి. కానీ, ఆ జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్‌తో పాటు తన డ్రైవరు, వ్యక్తిగత సిబ్బంది, కుటుంబీకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. మావోయిస్టుల వంటి వామపక్ష తీవ్రవాదుల కార్యకలాపాలను అరికట్టటానికి పని చేయాల్సిన ఎస్‌ఐబీ కార్యాలయాన్ని ఆ ముసుగులో పూర్తిగా స్వలాభం కోసం కేసీఆర్, కేటీఆర్‌లు వాడుకున్నారని విమర్శించారు. స్వయానా ఎమ్మెల్సీ కవిత, ఆమె భర్త ఫోన్లనూ వదిలిపెట్టలేదనీ, సహచర మంత్రుల ఫోన్లు, సొంత ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించినట్టు తనకు సిట్ అధికారులు చూపిన జాబితాలో బయటపడిందని కేంద్రమంత్రి వివరించారు. దాదాపు నాలుగువేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించిన జాబితాను చూసి తానే విస్తుపోయానన్నారు. ఇంతటి దుర్మార్గానికి, అప్రజాస్వామిక విధానాలకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడటం అత్యంత సిగ్గుచేటని ఈసడించారు. అప్పటి ఎస్‌ఐబీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, డీసీపీ రాధాకిషన్‌రావులు నిర్వహించిన పాత్రను విని తనకే సిగ్గనిపించిందనీ, తన ఫోన్ ట్యాపింగ్ జరిగిన విధానాన్ని సిట్ అధికారులకు పూర్తిగా వివరించానని తెలిపారు. భార్యాభర్తల ఫోన్లూ ట్యాప్ చేసి విన్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు విచారిస్తున్న హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. ఫోన్ల ట్యాపింగ్ ద్వారా అనేక లావాదేవీలకు సంబంధించి లబ్ధి పొందారని వివరించారు. ”ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్లు దోచుకున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద రూ.7 కోట్లు పట్టుకున్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. చాలా మంది నాయకుల వద్ద రూ.వందల కోట్లు సీజ్ చేసి పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను కేసీఆర్, కేటీఆర్‌కు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు పంపారు. రూ.20 కోట్లు దొరికితే.. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ చేశాక రూ.2 కోట్లు అవుతాయి. రూ. వేల కోట్లు అక్రమాలు జరిగితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఈడీకి లేఖ రాస్తే విచారణ జరుపుతుంది. సిట్ అధికారులు నిజయితీ పరులు, వారిపై మాకు అనుమానం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైనే మా అనుమానం అంతా. ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలున్నా ఎంతకాలం గడుపుతారు. కమిషన్లు వేసి కాలయాపన చేస్తారు. నివేదికలు ఇచ్చినా చర్యలు లేవు. ఏడాది గడిచినా ఒక్క నాయకుడిని కూడా అరెస్టు చేయలేదు” అని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంత్రి బండి సంజయ్ దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌కు వాంగ్మూలం ఇవ్వటానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ సిట్ ఉన్నతాధికారులు ఆయన కోసం వేచి ఉన్నారు. ఆయన వాంగ్మూలమిస్తున్నంత సేపు దిల్‌కుషా గెస్ట్‌హౌజ్ వద్ద సాయుధ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గేటు వెలుపల పలువురు బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES