Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమా ఓటు-మా హక్కుమా పోరాటం

మా ఓటు-మా హక్కుమా పోరాటం

- Advertisement -

– ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందే
– పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రతిపక్షాల నిరసనలు
– బీజేపీకి ఈసీ బీ టీమ్‌ : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌బ్రిట్టాస్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
: బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై పార్లమెంట్‌ దద్దరిల్లింది. ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. పార్లమెంట్‌ లోపల, బయట ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. దీంతో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదాల పర్వంలోనే ముగిశాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్లకార్డు పట్టుకుని ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని నినాదాల హౌరెత్తించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే
సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతొ సభను సోమవారాని కి వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనే ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. వివిధ అంశాలపై చర్చించాలని సభ్యులు 267 రూల్‌ కింద ఇచ్చిన 20 నోటీసులను రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ అంతరాయాల వల్ల 56.49 గంటల కోల్పోయిందని అన్నారు.

పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన
పార్లమెంట్‌ ఆవరణలో బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)కి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణంలో మకరద్వారం వద్ద ”మా ఓటు, మా హక్కు, మా పోరాటం” అంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేట్టారు. ప్లకార్డులు పట్టుకుని మోడీ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌, వి. శివదాసన్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎ.రాజా, ఎస్‌పీ ఎంపీ సుప్రియా సులే, ఎన్‌సీపీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా ఇతర ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు.

ఓట్ల అవకతవకల్లో ఈసీ వైఖరిపై ప్రతిపక్షం ఆగ్రహం
ఓట్ల అవకతవకల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిపై ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ ”బీజేపీకి ఈసీ బీ టీమ్‌గా మారిందని, రెండు కార్యాలయాలను విలీనం చేయాలని వెల్లడైంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యం పట్ల సీరియస్‌గా ఉంటే, పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చకు అనుమతించాలి” అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ ”ఎన్నికల కమిషన్‌ విచారణ నిర్వహించి, ఏం జరుగుతుందో దేశానికి చెప్పాలని దేశం మొత్తం చెబుతోంది. ప్రభుత్వానికి ఎస్‌ఐఆర్‌ గురించి సభలో చర్చించే ధైర్యం లేదు. కాబట్టి వారు ఈ అంశాన్ని సభలో ఎందుకు చర్చిస్తారు? ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది, అది సభను నడపలేకపోతోంది” అని విమర్శించారు. ”… ఈసీ అఫిడవిట్‌ ఎందుకు అడుగుతుంది ఉద్దేశపూర్వకంగా తప్పు జరిగితే, వారు దానిపై దర్యాప్తు చేయాలి. మీరు మాకు ఓటరు జాబితాను ఎందుకు అందించడం లేదు? మీరు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? విధానసభ ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎంత కీలకమో వారికి అర్థమైందా? దాదాపు లక్ష మంది ఫేక్‌ ఓటర్లతో ఎవరు గెలుస్తారో వారు స్పష్టంగా నిర్ణయించగలరు” అని అన్నారు. ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సులే మాట్లాడుతూ ”రాహుల్‌ గాంధీ వివరణాత్మక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఒక చర్చ జరిగింది. ప్రతి రాష్ట్రం, జిల్లా, తాలూకాలలో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారందరి ముందు అలాంటి ప్రజెంటేషన్‌ను ప్రదర్శించాలని శరద్‌ పవర్‌ సూచించారు. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర సంస్థ అయితే, వారు స్పందించాలి” అని అన్నారు. జేఎంఎం ఎంపీ మహువా మాఝీ మాట్లాడుతూ ”రాహుల్‌ గాంధీ అబద్ధం చెప్పారని మీరు నిరూపిస్తారు. ఆయన మొత్తం దేశం ముందు ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆయన వాస్తవాలు వివరించారు. ఇవి ఎన్నికల కమిషన్‌ పత్రాలు అని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రధాన నాయకులకు ఆయన పత్రాలను సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం తాను అబద్ధం చెబుతున్నానని భావిస్తే, వారు దానిని నిరూపించాలని అన్నారు” అని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img