నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు పలువురు వక్తలు ప్రకటించారు. ఆ రోజు మోడీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 22న నల్లబ్యాడ్జీలు ధరించి ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఎంపీలంతా పార్లమెంట్‌ను బారుకాట్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త రౌండ్ టేబుల్ సమావేశం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ అధ్యక్షతన జరిగింది. అందులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు పశ్యపద్మ, జక్కల వెంకన్న, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ, కోశాధికారి వంగూరు రాములు, టీయూసీఐ జాతీయ కమిటీ సభ్యులు వి.ప్రవీణ్, రాష్ట్రనాయకులు ప్రదీప్, ఐఎఫ్‌టీయూ ఆఫీస్ బేరర్లు అనురాధ, అరుణ, తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి మూఢ్ శోభన్‌నాయక్, హెచ్‌ఎంఎస్ నాయకులు హమ్జన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ట్రంప్ దూకుడుతో మన దేశం ఎగుమతి చేసే వస్తువులపై 50 శాతం సుంకాలు విధించడం, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని చేస్తున్న ఒత్తిళ్లు దేశ వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతాయని హెచ్చరించారు. ట్రంప్ ఒత్తిళ్లకు మోడీ తలొగ్గడం, గమ్ముగా ఉండటం వల్ల మన దేశ సార్వభౌమత్వానికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి పాల ఉత్పత్తులు, గోధుమలు, సోయాలు దిగుమతి చేసుకుంటే మన రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాల ఉత్పత్తులదే కీలకమని చెప్పారు. అమెరికా పాలు దిగుమతి చేసుకుంటే మన దేశంలో వ్యవసాయంతో పాటు పాల సేకరణపై బతుకుతున్న చిన్న, సన్న కారు రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని వాపోయారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని చెప్పడానికి ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తేవడం దుర్మార్గమన్నారు. పది గంటల పనివిధానాన్ని అధికారికంగా అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేయడం దారుణమన్నారు. మోడీ నిర్ణయాలను కర్నాటక, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పనివిధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ముందు మోడీ బానిసగా మారారనీ, దేశ ప్రజలను కూడా బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మోడీ తన నిర్ణయాలను మార్చుకోకపోతే ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
13న నిరసనలు, దిష్టిబొమ్మ దహనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES