– బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రమే అడ్డుకుంటోంది
– సీఎంపై రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావు : ఇష్టాగోష్టిలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంఘంగా మారిందని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. ఎన్డీఏ పక్షాల కంటే విపక్షాలపై ఈడీ ఎక్కువగా కేసులు నమోదు చేసిందని విమర్శించారు. ఈడీని అడ్డం పెట్టుకుని బీజేపీ విపక్షాలను భయాందోళనకు గురి చేస్తున్నదని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఇష్టాగోష్టిగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఆ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాలేకపోయారని తెలిపారు. సీఎంపై ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే అనిరుద్‌రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్‌పై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజరు చేస్తున్న విమర్శలు అర్థరహితమని చెప్పారు. పదేండ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు అలా మాట్లాడి ఉంటారని ఈ సందర్భంగా వివరించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి చాలా మారారు. పీసీసీగా ఉన్నప్పుడు రేవంత్ వేరు. ఇప్పుడు వేరు’ అని చెప్పారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ…కేంద్రంలో మాత్రం ఆ బిల్లును అడ్డుకుంటున్నదని విమర్శించారు. నాలుగుగైదు రోజుల్లో పీఏసీ సమావేశం నిర్వంహించి పదవులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం రేవంత్‌కు, తనకు మధ్య విభేదాలున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు.
బీజేపీ అనుబంధ విభాగంగా కేంద్ర ఎన్నికల సంఘం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES