– గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఇజ్రాయిల్ ప్రణాళికను ఖండించిన ఐరాస చీఫ్
న్యూయార్క్ : గాజా స్ట్రిప్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ఇజ్రాయిల్ ప్రణాళికపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఇప్పటికే దారుణంగా ఉన్న పాలస్తీనియన్ల పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ”గాజా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ఇజ్రాయిల్ ప్రభుత్వం నిర్ణయం నన్ను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. ఈ నిర్ణయం ప్రమాదకరమైన తీవ్రతను సూచిస్తుంది. లక్షలాది మంది పాలస్తీనియన్లు ఇప్పటికే అనుభవిస్తున్న విపత్కర పరిణామాలను మరింత తీవ్రతరం చేస్తుంది. హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలతో సహా మరింత మంది ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది’ అని గుటెర్రెస్ ఈ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఈ నిర్ణయం వలన మరిన్ని బలవంతపు వలసలు, హత్యలు, భారీ విధ్వంసాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. ‘శాశ్వత కాల్పుల విరమణ, గాజాలోకి అడ్డంకులు లేని ప్రవేశాలు, బందీలందర్నీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి’ అని తన డిమాండ్‌ను గుటెర్రెస్ మరోసారి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని కోరారు. ‘గాజాలో స్థిరనివాసితులను ఖాళీ చేయించడంతో పాటు తన అన్ని కార్యకలాపాలు ఇజ్రాయిల్ నిలిపివేయాలి. అక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్ వెనక్కి రావాలి’ అని గతేడాది జులై 19న అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన సలహా అభిప్రాయాన్ని గుటెర్రెస్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘చట్టవిరుద్ధమైన ఇజ్రాయిల్ ఆక్రమణలకు ముగింపు పలకకుండా, ఆచరణీయమైన రెండు దేశాల పరిష్కారాన్ని సాధించకుండా ఈ వివాదానికి సిర్థ ఉండదు. పాలస్తీనాలో గాజా అంతర్భాగంగా ఉంది. అలాగే ఉండాలి’ అని గుటెర్రెస్ స్పష్టం చేశారు. కాగా, గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఇజ్రాయిల్ నిర్ణయంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం శనివారం కాకుండా ఆదివారం జరగనుంది.
మరింత దిగజారిన పాలస్తీనియన్ల పరిస్థితి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES