నవతెలంగాణ -హైదరాబాద్ : మహారాష్ట్రలో వెలుగు చూసిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 12 ఏళ్ల బంగ్లాదేశ్ బాలికపై మూడు నెలల వ్యవధిలో 200 మందికి పైగా పురుషులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లా, నైగావ్‌లో సెక్స్ రాకెట్ నుంచి ఆ బాలికకు విముక్తి కల్పించిన తర్వాత ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మీరా-భయందర్ వసాయి-విరార్ పోలీస్ విభాగంలోని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం జులై 26న ‘ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్’, ‘హార్మొనీ ఫౌండేషన్’ అనే ఎన్జీవోల సహాయంతో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన 12 ఏళ్ల బాలికను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల విచారణలో బాలిక చెప్పిన విషయాలు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనపై హార్మొనీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్రహం మథాయ్ మాట్లాడుతూ.. ఆ బాలికను మొదట గుజరాత్‌లోని నడియాద్‌కు తీసుకెళ్లారని, అక్కడ మూడు నెలలపాటు 200 మందికిపైగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని ఆ బాలిక వివరించిందని తెలిపారు.
పాఠశాలలో ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయంతో తనకు తెలిసిన ఒక మహిళతో కలిసి ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయిందని మథాయ్ వివరించారు. “ఆ మహిళే బాలికను రహస్యంగా భారతదేశానికి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి నెట్టింది. ఆ బాలిక చెప్పిన ప్రతీ ఒక్కరినీ అరెస్ట్ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసుపై పోలీస్ కమిషనర్ నికెత్ కౌశిక్ స్పందిస్తూ, ఈ నెట్‌వర్క్‌ను మొత్తం బట్టబయలు చేయడానికి, అభాగ్యులైన యువతులకు సురక్షితమైన వాతావరణం కల్పించడానికి తమ విభాగం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని తెలిపారు.
సామాజిక కార్యకర్త మధు శంకర్ మాట్లాడుతూ “వాషి, బేలాపూర్ ప్రాంతాల్లో బాలికలు భిక్షాటన చేయడం నేను చాలాసార్లు చూశాను. వీరిని చిన్నతనంలోనే గ్రామాలనుంచి దొంగిలించి నగరాలకు తీసుకొచ్చి దోపిడీకి గురిచేస్తున్నారు. వీరిని పర్యవేక్షించే కొందరు మహిళలు వ్యభిచారంలోకి కూడా దింపుతున్నారు. త్వరగా యుక్తవయస్కులుగా కనిపించడానికి వారికి హార్మోన్ల ఇంజెక్షన్లు కూడా ఇస్తున్నారు” అని తెలిపారు. ఈ నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.