2023 అక్టోబరు ఏడున గాజాలో ఇజ్రాయిల్ ప్రారంభించిన మారణకాండ మరోదశలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నా యి. హమాస్‌ను అంతమొందించేందుకు గాజా స్వాధీనం తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ఇప్పటివరకు 75వేల మంది వరకు నిరాయుధులైన పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ మిలిటరీ చంపివేసింది. వీరిలో సగానికి పైగా పిల్లలు, మహిళలు ఉన్నారు. దాదాపు రెండు లక్షల మందిని గాయపరిచార. లక్షలాది ఇండ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలను నేలమట్టం గావించారు. అయినప్పటికీ హమాస్, ఇతర సాయుధ బృందాలను పట్టుకోవటంలో విఫలమైంది. వారిని పట్టుకోవాలంటే గాజాను పూర్తిగా తన స్వాధీనంలో తెచ్చుకోవాలని ఇజ్రాయిల్ చెబుతోంది. నిజానికి ఒక విధంగా గాజా ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆక్రమణలోనే ఉంది. ఆకలితో మాడుతున్న పసిపిల్లలకు అవసరమైన ఆహారసాయాన్ని కూడా రాకుండా మిలిటరీ అడ్డుకుంటున్నది, సహాయ శిబిరాల వద్దకు వచ్చిన వారిని కూడా చంపివేస్తున్నది. ప్రపంచంలో అనేక యుద్ధాలు, ఉద్రిక్తతల సమయంలో వార్తలను సేకరించే జర్నలిస్టులకు రక్షణ ఉంటుంది, ప్రమాదవశాత్తూ గాయపడటం, మరణించటం వేరు. కానీ గాజాలో ఇప్పటివరకు 242 మంది జర్నలిస్టులను ఇజ్రాయిల్ బలగాలు చంపివేశాయి. తాజాగా అల్ జజీరా టీవీ, పత్రికలకు వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను హతమార్చారు, ఏమిటంటే వారంతా హమాస్ సాయుధులతో కలసి ఉన్నారంటూ పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. అనాస్ అల్ షరీఫ్ అనే ఆల్ జజీరా విలేకరి తన కుటుంబం, ప్రపంచానికి ‘ఎక్స్’ ద్వారా ఒక చివరి సందేశం పంపాడు.” ఇది చివరి వర్తమానం, మీకు అందే సమ యానికి ఇజ్రాయిల్ నన్ను చంపివేస్తుంది, నా గళాన్ని అణచివేస్తుంది, ప్రపంచం గాజాను మరచిపోవద్దు” అని దానిలో ఉంది. ఆదివారం రాత్రి అదే నిజమైంది. గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జర్నలిస్టులు ఉన్నారనే చిహ్నాలు ఉన్న గుడారాన్ని లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడిలో అల్ షరీఫ్‌తో పాటు తమ జర్నలిస్టులు మరో నలుగురితో సహా ఏడుగురిని చంపినట్లు అల్ జజీరా తెలిపింది.
అనాస్ అల్ షరీఫ్ చివరిసారిగా ఎక్స్‌లో పంపిన వర్తమానం ఇలా ఉంది.” ఇది నా వాంఛ మరియు చివరి వర్తమానం. ఇది మీకు చేరేలోపు ఇజ్రాయిల్ నన్ను చంపటంలో జయప్రదం అవుతుంది, నా గళం మూగపోయేట్లు చేస్తుంది. మొదటిది మీకు శాంతి చేకూరాలి, అల్లా దయ, దీవెనలు మీకు కలగాలి. జబాలియా శరణార్ధి శిబిరంలో నేను జన్మించి కండ్లు తెరిచినప్పటి నుంచి అక్కడి వీధులు, సందుల్లో తిరుగాడుతూ నా జనం కోసం గళం విప్పి మద్దతు ఇచ్చిన ప్రతి అంశం గురించి అల్లాకు తెలుసు. మా స్వంత పట్టణమైన ఆక్రమిత అస్కలాన్( అల్ మజదాల్)కు తిరిగి వచ్చేందుకు అల్లా నా జీవితాన్ని పొడిగిస్తాడని ఆశిస్తున్నాను, అందువలన నేను నాకుటుంబం, ప్రేమించేవారిని కలుసు కొనేందుకు తిరిగివస్తాను. అయితే అల్లా వాంఛ ముందు మరియు ఆయన ఆదేశమే అంతిమం.
నేను బాధల మధ్యనే జీవించాను, అనేక నష్టాలు, ఇబ్బందులను చవిచూశాను. అయినప్పటికీ ఎలాంటి వక్రీకరణలు, తప్పుడు సమాచారం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజాన్ని చేరవేసేందుకు ఒక్కసారి కూడా నేను వెనుకాడలేదు.ఏడాదిన్నరకు పైగా మన జనాలు ఎదుర్కొంటున్న ఊచకోతను ఆపేందుకు ఏమీ చేయని వారిని, మన పిల్లలు, మహిళల శరీరాలు ఛిద్రమైనా చలించని హృదయాలు కలవారిని, మౌనంగా దూరంగా ఉన్నవారిని, మన హత్యలను ఆమోదించిన వారిని, మన శ్వాసను ఆడనివ్వని వారిని అందరినీ అల్లా చూస్తున్నాడు.
ముస్లిం సమాజ కిరీటంలో మణి, ఈ ప్రపంచంలోని ప్రతి స్వేచ్ఛాజీవి గుండెచప్పుడు వంటి పాలస్తీనాను మీకు అప్పగిస్తున్నాను. దాని జనాన్ని, తప్పుచేసిన వారినీ, రక్షణ, శాంతిలేకుండా జీవించేం దుకు లేదా కలలు కనేందుకు కూడా ఎన్నడూ సమయంలేని అమాయకులైన పిల్లలతో పాటు మీకు అప్పగిస్తున్నాను. వేలాది టన్నుల ఇజ్రాయిలీ బాంబులు, క్షిపణులతో నిర్మలమైన వారి శరీరాలు నలిగిపోయాయి, ఛిద్రమైన వారి భాగాలు అంతటా పడ్డాయి. బంధ నాలు మిమ్మల్ని మౌనంగా ఉంచలేవు, సరిహద్దులు ఏమీ చేయలేవు. అపహరించిన మన మాతృభూమిలో స్వేచ్ఛ, హుందాతనపు సూర్యుడు ఉదయించే వరకు మన భూమి, పౌరుల విముక్తి కోసం మీరు వారధులుగా మారండి.
నా కుటుంబ మంచిచెడ్డలను మీకు అప్పగిస్తున్నాను. నేను కలలు కన్నవిధంగా నా కుమార్తె షామ్ ఎదగటాన్ని చూసే అవకాశం నాకు రాలేదు. నాకనుల వెలుగైన ఆమెను మీకు అప్పగిస్తున్నాను. నా భారం మోసేంతవరకు, నా లక్ష్యా న్ని సాధించేవరకు, అతని పెరుగుదలకు నా ప్రియమైన కుమారుడు సాలాV్‌ాను కూడా మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రేమించే నా మాతృమూర్తిని కూడా మీకు అప్పగిస్తున్నాను.నేను ఇలా ఉండటానికి ఆమె చేసిన ప్రార్థనలే కారణం. అవే నాకు పెట్టనికోట, ఆమె ఇచ్చిన వెలుగు బాట నాది. ఆమెకు శక్తిని ప్రసాదించాలని, శుభం కలగాలని నా తరఫున అల్లాను ప్రార్ధిస్తున్నాను.
నా జీవితకాల సహచరి, భార్య ఉమ్ సాలాహ్(బయాన్) బాధ్యతను కూడా మీకు అప్పగిస్తున్నాను. యుద్ధం మమ్మల్ని రోజులు, నెలల తరబడి విడదీసింది. వంగని ఆలివ్ చెట్టు కొమ్మలా ధీటుగా ఆమె నిలిచింది, బంధానికి కట్టుబడి ఉంది, సహనంతో ఆల్లా మీద విశ్వాసంతో ఉంది. నా పరోక్షంలో ఆమె బాధ్యతలను నిర్వహించేందుకు ఆమె తన యావత్ శక్తి, విశ్వాసాన్ని వినియోగిస్తున్నది. వారందరికీ మీరు అండగా నిలవాలని కోరుతున్నాను, అల్లా తర్వాత మీరే వారికి మద్దతు ఇవ్వాలి.
నేను గనుక మరణిస్తే, నా సిద్ధాంతాలకు గట్టిగా నిలిచి నేను మరణించేందుకు సిద్ధం. నేను అల్లా ఆదేశాలకు అను గుణంగా నడుస్తానని ప్రమాణం చేశాను, నేను ఆయన్ను తప్పకుండా కలుసుకుంటాను. ఆయనతో ఎప్పటికీ నిలిచి ఉంటానని హామీ ఇస్తున్నాను. ఓ అల్లా అమరజీవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించు, నా గత, భవిష్యత్ పాపాలను క్షమించు. నాజననం, నా కుటుంబం స్వేచ్ఛాబాటలో నడిచేందుకు అవసరమైన వెలుగునిచ్చేందుకు నా రక్తం తోడ్పడేట్లు చేయి. ఆకాంక్షలకు అనుగుణంగా నేను లేనట్లయితే నన్ను క్షమించు.
నా వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు దాన్ని ఎన్నడూ మార్చుకోకుండా, ద్రోహం చేయకుండా ఉండేందుకు దయతో నాకోసం ప్రార్ధించండి. గాజాను మరచిపోవద్దు. క్షమ మరియు మీలో ఒకడిగా అంగీకరించేందుకు మీరు చిత్తశుద్ధితో చేసే ప్రార్ధనల్లో నన్ను మరవకండి.”హృదయాలను కదలించే చివరి సందేశం పంపిన అనాస్ అల్ షరీఫ్ 28 సంవత్సరాల యువకుడు, జర్నలిస్టు, వీడియో గ్రాఫర్. అతని స్వస్థలం ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆక్రమణలో ఉంది.పాలస్తీనా విముక్తి పోరులో ప్రాణాలకు తెగించి వార్తలను అందిస్తున్నవారిలో ఒకడు. అతనికి హమాస్ తీవ్రవాది ముద్రవేసిన ఇజ్రాయిల్ మిలిటరీ గత రెండు సంవత్సరాలుగా చంపివేస్తామని అనేకసార్లు బెదిరించింది. అది చంపదలుకున్న వారందరికీ ఏదో ఒక ముద్రవేస్తున్నది. ఇజ్రాయిల్ ఆరోపణను ఐరాస తిరస్కరించింది. గాజా మారణకాండకు సంబంధించి అతను తీసిన ఫొటోకు 2024లో పులిట్జర్ బహుమతి ఇచ్చారు. రెండేండ్లుగా అల్ జజీరాలో పనిచేస్తున్నాడు. గత నెలలో ఆకలితో చంపుతున్న ఇజ్రాయిల్ దుశ్చర్యను వెలుగులోకి తెచ్చాడు. అప్పటి నుంచి అతని కోసం ఇజ్రాయిల్ మిలిటరీ వేట ప్రారంభించి చివరకు ఆగస్టు పది రాత్రి విమానాలతో దాడి చేసి హతమార్చింది.
అల్ షరీఫ్ వంటి ఎందరో పాలస్తీనియన్లు శరణార్ధి శిబిరాల్లోనే పుట్టి అక్కడే పెరిగి చివరికి అదే ఇజ్రాయిల్ దుర్మా ర్గాలకు అక్కడే బలవుతున్నారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండ, పోరు అలాంటి ఎందరినో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం చేస్తున్నది తప్ప పిరికిబారేట్లు చేయటం లేదు. 2023 అక్టోబరు ఏడు నుంచి ఇప్పటి వరకు 242 మంది జర్నలిస్టులను చంపినట్లు ఐరాస పేర్కొన్నది. రెండు ప్రపంచ యుద్ధాలు, వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణ వంటి అనేక యుద్ధాలన్నింటిలో కూడా ఇంత మంది ప్రాణాలు కోల్పోలేదని విశ్లేషకులు పేర్కొన్నారు.ఇటీవలి సంవత్సరాల్లో జర్నలిస్టులకు ప్రాణాంతక, అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఉదంతం ఈ మారణకాండ. తనకు అనుకూలంగా వార్తలు ఇచ్చేవారిని తప్ప అంతర్జాతీయ జర్నలిస్టులను గాజాలో ప్రవేశించకుండా ఇజ్రాయిల్ అడ్డుకుంటున్నది. ఈ నేపథ్యంలో స్థానిక పాలస్తీనియన్లే విలేకర్లుగా మారి ఆల్ జజీరా వంటి మీడియా సంస్థ లకు వార్తలను అందిస్తున్నారు. అది కూడా లేనట్లయితే అసలు గాజాలో ఏం జరుగుతున్నదో బయటి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.
గాజాలో తాజా పరిణామాల విషయానికి వస్తే హమాస్ ఆయుధాలు విసర్జింతవరకు దాడులు చేయటం తప్ప మరొకమార్గం లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించాడు. ప్రస్తుతం 70నుంచి75శాతం వరకు తమ ఆధీనంలో ఉందని చెప్పాడు. హమాస్‌కు రెండు గట్టి స్థావరాలు ఉన్నాయని పూర్తిగా తుదముట్టించాలంటే గాజా స్వాధీనం చేసు కోవాల్సిందే అన్నాడు. ఈ వైఖరిని అనివార్యమై కొన్ని పశ్చిమదేశాలు బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అమెరికా అండతో ఈ దుర్మార్గానికి పూనుకున్నాడు. గాజాలో దాడులకు ఉపయోగించే ఆయుధాలను ఇజ్రాయిల్‌కు నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే నిజంగా అమలు చేస్తుందా లేక వేరే మార్గాల ద్వారా సరఫరా చేస్తుందా అన్నది చెప్పలేము. గాజా ఆక్రమణను అడ్డుకొనేందుకు ముస్లిం దేశాలన్నీ ఐక్యం కావాలని టర్కీ, ఈజిప్టు పిలుపునిచ్చాయి. ఈజిప్టుతో చర్చలు జరిపిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి బదర్ అబ్దెలెటీతో కలసి టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ శనివారం నాడు విలేకర్ల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. రెండు దేశాలూ ఇజ్రాయిల్ చర్యను ఖండించాయి.తక్షణమే ఇస్లామిక్ దేశాల సంస్ధ సమావేశం జరపాలని కోరాయి. ఇజ్రాయిల్ చర్య ఒక్క పాలస్తీనాకే గాక ఇరుగుపొరుగు దేశాలన్నింటికీ ప్రమాదమే అని పేర్కొన్నాయి. ఇస్లామిక్ దేశాల సంస్థ విదేశాంగ మంత్రుల కమిటీ కూడా ఖండించింది.
భద్రతా మండలి, ప్రపంచ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవాలని కోరింది. లక్షలాది మంది ఇజ్రాయిల్ పౌరులు రాజధాని టెల్ అవీవ్, ఇతర నగరాల్లో గాజా దురాక్రమణ ప్రతిపాదనను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వ చర్యకు సైనికులు మద్దతు ఇవ్వరాదని నినదించారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అవసరమైతే నెత న్యాహు ప్రభుత్వ వైఖరిని నిరసనగా సాధారణ సమ్మె జరపాలని బందీల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. స్వజనంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ చర్యలకు నానాటికీ వ్యతిరేకత వెల్లడవుతున్నప్పటికీ డోనాల్డ్ ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పులేదు, నిస్సిగ్గుగా మద్దతు ప్రకటిస్తున్నాడు. మరింత పెద్దఎత్తున నిరసనోద్యమం జరిగితే తప్ప ఇజ్రాయిల్ వెనుకడుగువేసే అవకాశం లేదు.
ఎం కోటేశ్వరరావు
8331013288
ప్రపంచమా.. గాజాను మరచిపోవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES