– భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులకు కేటీఆర్ విజ్ఞప్తి
– వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడిన కేటీఆర్
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా లేకపోయినా, ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైనచోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే వరద వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రభుత్వ వైఫల్యం వలన ఇబ్బందులు పడుతుండడం పైన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాలకు చెందిన పార్టీ లీడర్లు శ్రేణులు సహాయక చర్యల్లో మరింత చొరవ చూపాలన్నారు. ఈ మేరకు ఆ మూడు జిల్లాల పార్టీ నేతలతో కేటీఆర్ మాట్లాడారు. ఈ కష్టకాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.