Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిస్వాతంత్య్ర దినాన గుర్తుచేసుకోవాల్సిన మంచి విషయాలు

స్వాతంత్య్ర దినాన గుర్తుచేసుకోవాల్సిన మంచి విషయాలు

- Advertisement -

స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొని, జైలు జీవితం గడుపుతున్న దశలో అంటే 1934-35 ప్రాంతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ తన ఆత్మకథ (TOWARDS FREEDOM) రాసుకున్నారు. బానిససంకెళ్లు తెంచుకుని, దేశం స్వేచ్ఛకోసం తపిస్తున్న దశలో ఆయన ఆ గ్రంథంలో తన అనుభవాలు నమోదు చేసుకున్నారు. నెహ్రూజీ జైలులో ఉన్నప్పుడే ఆయన భార్య కమలా నెహ్రూ అనారోగ్యంతో మంచానపడి ఉన్నారు. కూతురు ఇందిర అప్పటికి చిన్నపిల్ల. ఆమె ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవడం వల్ల, ఆమెను తరచూ రవీంద్రుడి శాంతినికేతన్‌కు పంపుతూ ఉండేవారు. రవీంద్రుడి పర్యవేక్షణలో ఆమె బాల్యం అక్కడ గడుస్తూ ఉండేది. అందరినీ సమంగా ప్రేమగా చూసే లక్షణం ఆ బాలికలో ఉందని గ్రహించి, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ఆమెని ముద్దుగా ‘ప్రియదర్శిని’ అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె ఆలా ఇందిరా ప్రియదర్శిని అయింది!
పండిట్‌ నెహ్రూకు సాహిత్యం కళలపట్ల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ జగద్విదితం! ఆయన ఆత్మకథను చదివి టాగూర్‌ ఆశ్చర్య చకితుడైపోయారు. ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉత్తరం రాశారు. అప్పటికి నెహ్రూ భారత తొలిప్రధాని కాలేదు. స్వాతంత్రోద్యమంలో ప్రముఖపాత్ర పోషిస్తున్న యోధుడు- దేశ భక్తుడు మాత్రమే! భార్య అనారోగాన్ని, అస్తవ్యస్తమైన కుటుంబాన్నీ పక్కనపెట్టి, పూర్తి సమయం దేశం కోసం వెచ్చించడం, మానవీయ విలువల కోసం తపించడం రవీంద్రుడికి బాగా నచ్చింది. 31 మే, 1936న తన నివాసమైన శాంతినికేతన్‌ నుండి రవీంద్రనాథ్‌ టాగూర్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూకు రాసిన ఉత్తరం ఇలా ఉంది-
”ప్రియమైన జవహర్‌,
మీ పుస్తకం ‘టువర్డ్స్‌ ఫ్రీడమ్‌’- ఇప్పుడే పూర్తిచేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం! చదువుతూ చదువుతూ ఎంతగానో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకుని గర్వపడుతున్నాను. అన్నింటినీమించి అట్టడుగున ప్రవహించే లోతైన మీమానవత్వపు దృక్కోణం-సక్లిష్టమైన చిక్కుముడులన్నింటినీ విప్పుతూ ఉంది! వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకు మీరు సాధించిన విజయాలకు మించిన మహాన్నతమైన వ్యక్తిత్వం – అనే విషయం మీ పుస్తకం పుటలు తిప్పేస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంది. సమకాలీన స్థితిగతుల నుంచి నిజాయితీ అయిన ఒక నిఖార్సయిన మీవ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది.-” అని కితాబిచ్చారు రవీంద్రనాథ్‌ టాగూర్‌!
సాహిత్య ప్రేమికుడు, సాహిత్యకారుడూ అయిన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు విశ్వకవి రవీంద్రుడు, సరోజినీ నాయుడు, అమృతా షేర్‌గిల్‌, ఫ్రెంచ్‌ సాహిత్య కారుడు, నొబెల్‌ గ్రహీత రోమైన్‌ రొల్లాండ్‌ వంటి దిగ్గజాల నుండి తరచూ ఉత్తరాలు వస్తూ ఉండేవి. సమయం చూసుకుని వారికి నెహ్రూజీ జవాబులు రాస్తుండేవారు. ఆ రోజుల్లో విషయాలు తెలుపుకోవాలంటే ఏకైక మార్గం ఉత్తరాలు రాసుకోవడమే! దానితోపాటు లేఖలు రాయడం కూడా ఒక కళాగా పరిగణింపబడుతూ ఉండేది. ఆలోచనా పరుల మధ్య సాగే ఉత్తరాలైతే మరింత ఉత్తేజ భరితంగా ఉంటుండేవి. జైలునుండి నెహ్రూజీ తన కూతురు ఇందిరా ప్రియదర్శినికి రాసిన ఉత్తరాలు సాహిత్య ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ఆ ఉత్తరాల్లో స్వాతంత్రోద్యమ అంశాలు, దేశ కాలపరిస్థితులు, చారిత్రక, సామాజిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చించబడుతూ ఉండేవి. తరువాతి కాలంలో ఆ ఉత్తరాలన్నీ ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ శీర్షికతో పుస్తకంగా వెలువడింది. విశ్వ సాహిత్యంలో విశిష్టమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ గ్రంథం ఆధారంగానే చిత్ర దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ ”భారత్‌ ఎక్‌ ఖోజ్‌” పేరుతో టెలివిజన్‌ సీరియల్‌ రూపొందించారు.
”తన తర్వాత తన భాష మాట్లాడేది నెహ్రూ నే” -అని గాంధీజీ తరచూ అనేవారు. సి.రాజగోపాలాచారి (రాజాజి) నెహ్రూకన్నా వయసులో పదకొండేళ్ల పెద్ద-అయినా కూడా, తనకన్నా నెహ్రూ పదకొండు వందల రెట్లు గొప్పవాడని రాజాజీ ప్రశంసిస్తూ ఉండేవాడు. అలాగే సర్దార్‌ వల్లభాయి పటేల్‌ పండిట్‌ నెహ్రూ కన్నా పద్నాలుగేళు ్లపెద్దవాడు. అయినా కూడా నెహ్రూకి తను జీవిత కాలం విధేయుడినని ప్రకటించుకున్నాడు. నెహ్రూ తొలిప్రధాని అయ్యాక, తన మంత్రివర్గంలో చేరి, హోంశాఖ నిర్వహించాల్సిందిగా పండిట్‌జీ పటేల్‌కు లేఖ రాశారు. దానికి వల్లభారు రాసిన ప్రత్యుత్తరం ఇలా ఉంది. ఆ ఉత్తరమే అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంది. అందులోని ముఖ్యమైన అంశాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
”ముప్ఫయ్యేండ్లుగా కొనసాగుతున్న మన స్నేహబంధం, స్వాతంత్రోద్యమంలో కార్యకర్తలుగా మన అనుబంధం చాలా గొప్పవి. వాటి ముందు ఈ ఆనవాయితీ అంగీకారాలు అవసరం లేదు. నాసేవలు మీరు ఎలాగంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఈ దేశం కోసం మీరు చేసిన త్యాగం గొప్పది. అలాంటి త్యాగం మీరుకాక మరొకరు ఎవరూ చేయలేదని నావిశ్వాసం! అందువల్ల ఇక నా జీవితమంతా మీకు ఎదురు చెప్పనివాడిగా, విశ్వాసపాత్రుడిగా ఉంటానని మాట ఇస్తున్నాను. మీరు నాకు కేటాయించిన పనిని అంకిత భావంతో చేస్తాను”
మరొక సందర్భం గూర్చి కూడా పటేల్‌ ఇలా రాశాడు.
”నేను కశ్మీరుకు చేయగలిగింది చేశాను. మీకూ, నాకూ కశ్మీరు సంబంధించిన విధానపరమైన అభిప్రాయభేదాలు లేవు. కానీ, మనకింద ఉన్నవారు మన మధ్య పెద్ద అగాధాలు ఉన్నట్లు భావించారు. అలాగని ప్రచారం చేసినట్లున్నారు. అయినా నిజాలు దాగవు”.
సర్దార్‌ వల్లభారు పటేల్‌ 1947 అక్టోబర్‌లో రాసిన ఉత్తరాన్ని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా ఒక పుస్తకంలో (2010) ప్రచురించింది. ప్రముఖుల ఉత్తరాలన్నీ సేకరించి ఎన్‌.బి.టి ప్రచురించిన పుస్తకంలో ఇది ఉంది. జవహర్‌లాల్‌ నెహ్రూ నాటి దేశ రాజకీయాలనే కాదు, ప్రపం చ రాజకీయాలను కూడా శాసించారు. దేశానికి దిశానిర్ధేశం చేస్తూ, దేశ ప్రజలకు వైజ్ఞానిక స్పృహను నూరిపోశారు. వాల్టర్‌ కూకర్‌ మాటల్లో నెహ్రూ ఒక అరుదైన వ్యక్తి, సర్వస్వతంత్రుడై ఉండి, తెలివీ, శక్తి సామర్థ్యాలు ఉండి, మంచివాడుగా, వినయశీలిగా ఉండడం చాలా అరుదు !” మరి ఇప్పుడు సమకాలీనంలో ఎలాంటి దేశ నాయకుల్ని చూస్తున్నాం? చదువులేక, సంస్కారం లేక, వ్యక్తిత్వం లేక, మందబలంతో బరితెగించిన నేతల్ని మనం మన కండ్లముందు చూస్తున్నాం. ఇంతెందుకూ? వారి పార్టీ నాయకుడూ, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌ పేయి నెహ్రూను ‘భరతమాత ముద్దు బిడ్డ – అని ప్రశంసించాడు. నెహ్రూ మరణించినప్పుడు వాజ్‌పేరు అర్పించిన నివాళి ఈ విధంగా ఉంది.
”ఒక కల విచలితమైంది. ఒక పాట మూగబోయింది. ఒక జ్వాల అనంతంలో కలిసిపోయింది. భయం, ఆకత లేని ఒక ప్రపంచపు కల అది ! ఇటు గీతాసారాన్ని ప్రతిధ్వనించే గీతం. ఆటు రోజా పువ్వు వెదజల్లే పరిమళం. ఎదురైన ప్రతిచీకటితో పోరాడుతూ, వెలుగులీనుతూ, ప్రతిరాత్రీ మేల్కోని మండుతున్న దీపం అది. మాకు దారి చూపుతూనే ఒకనాటి ఉదయం నిర్వాణం చెందింది.
మరణం తప్పదు – భౌతిక శరీరం తాత్కాలికం. ఆ బంగరు శరీరం నిన్న గంధపు చెక్కల మధ్య మాయమైంది. కానీ, ఆ మృతువు ఎందుకు అంత తొందరపడిందీ? స్నేహితులంతా నిద్రలో ఉన్నప్పుడు, పహరా కాస్తున్నవారు ఒకింత మగతగా ఉన్నప్పుడు.. జీవితంలో మాకు ఎంతోవిలువైన ఆ బహుమతిని మృత్యువు ఎందుకంత నిర్దాక్షణ్యంగా లాక్కుపోయిందీ?
భరతమాత విషాదంలో మునిగిపోయి ఉంది. తన ముద్దు బిడ్డను ప్రియతమ రాకుమారుణ్ణి ఈరోజు కోల్పోయానని! తన అనుచరుణ్ణి, తన సహచరుణ్ణి కొల్పోయానని – మానవత్వం ఈరోజు భిన్నవదనంతో ఉంది. తన పరిరక్షకుడు ఇక లేడని – శాంతి ఈ రోజు అసహనంగా ఉంది. అణగారిన బతుకులకు అండ లేకుండా పోయింది. సామాన్యుడి కండ్లలో వెలుగులు ఆరిపొయ్యాయి. తెర పడిపోయింది. ప్రపంచ రంగస్థలం మీది నుంచి ఒక ముఖనటుడు తన చివరిపాత్ర పోషించి, ప్రేక్షకుల వద్ద సెలవు తీసుకుని నిష్క్రమించాడు-”
భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పారు స్వయంగా కవి గనుక, భావోద్వేగంలో ఆయన చెప్పిన ఈ పైమాటలు కేవలం ఆన వాయితీగా చెప్పిన పొడిమాటలు కావు. ఆయన గుండె లోతుల్లోంచి తన్నుకుని వచ్చినవి అని అర్థమవుతూ ఉంది! పార్టీలు వేరైనా, రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా ఒక మహామనీషి కనుమరుగైన ప్పుడు- ఆయన వ్యక్తిత్వాన్ని నిజాయితీగా వ్యక్తీకరించాలి. ఆపని ఆనాటి బీజేపీ అగ్రనేత వాజ్‌పేరు చేశాడు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్‌పేరు విమర్శను ఆహ్వానించి పోత్సహించేవాడు. ఇందిరాగాంధీ తర్వాత వేర్వేరు వ్యక్తులు ప్రధానులయ్యారు. పార్లమెంట్‌హౌస్‌లో ఎవరో నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. అది గమనించిన వాజ్‌పేరు కలత చెందారు. దేశ తొలి ప్రధానిగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని గొడవ చేసి, మళ్లీ నెహ్రూ చిత్రపటాన్ని అక్కడ యధావిధిగా ఏర్పాటు చేయించారు. ప్రధానిగా అటల్‌జీ పార్లమెంట్‌లో చేసిన ఒక ఉపన్యాసంలో ఆయనే స్వయంగా ఈ విషయం తెలియజేశారు. అందుకే రాజకీయాల్లో ఉన్నవారంతా రాజనీతిజ్ఞులు కారు- అనేది సామాన్య ప్రజలు గ్రహించుకోవాలి! మరి, నేటి వాజ్‌పేరు వారసులు ఏ స్థాయిలో, ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉండాలి!
స్వాతంత్యం లభించిన నాటికి దేశంలో నెహ్రూ స్థానం ఏమిటీ? వల్లభారు పటేల్‌ స్థాయి ఏమిటీ? అనేది పటేల్‌ ఉత్తరాల వల్ల, వాజ్‌పేరు నెహ్రూకు అర్పించిన శ్రద్ధాంజలి వల్ల కొంత అర్థమవుతోంది కదా? దేశానికి స్వాతంత్య్రం చేజిక్కేనాటికి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ తిరుగులేని అగ్రనాయకుడు. ఆయన దార్శనికుడు గనుక, దేశ అవసరాలకు కావల్సిన ప్రాజెక్టుల విషయంలో, వైజ్ఞానిక పరిశోధనాశాలల స్థాపన విషయంలో, వైజ్ఞానికుల్ని ప్రోత్సహించిన విషయంలో విమర్శల్ని ఆహ్వానించే విషయంలో, లలిత కళల్ని, బాలల అవసరాల్ని గుర్తించిన విషయంలో ఆయనకు ఆయనే సాటి. పిల్లలు పెద్దవాళ్లవుతారు. ముసలివాళ్లు కూడా అవుతారు. తరాలు మారినా పండిట్‌ నెహ్రూ మాత్రం చాచా నెహ్రూగానే పిలవబడతారు. ఆయన పుట్టిన రోజు 14 నవంబర్‌ను పిల్లల దినంగా జరుపుకుంటున్నాం.
సైంటిఫిక్‌ టెంపర్‌ – పదాన్ని రూపొందించి ప్రపంచానికి అందించినవాడు మన తొలి ప్రధాని నెహ్రూ. దేశ ప్రజలు మూఢనమ్మకాల్లోంచి బయటపడాలని నిరంతరం చెబుతూ ఉండేవాడు. ధనం, స్థాయి, స్థోమత ఏమీలేనివాడు త్యాగం చేయడానికి ఏముంటుంది? ఇవన్నీ ఉండికూడా, దేశం కోసం అన్నింటినీ త్యజించి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడం గొప్ప! పైగా, కాశ్మీరీ పండిత్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడై ఉండి, నిరీశ్వరవాది కావడం అంతకన్నా గొప్ప!!
మరి నేటి దేశ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఎందుకు నెహ్రూస్థాయిని తగ్గిస్తున్నారూ? అంటే, వీరిలాగా ఆయన విద్వే షాన్ని వెదజల్లుతూ, దేశంలో మారణహోమాల్ని జరిపించలేదు. ఫుల్‌టైం బయటి దేశాల్లో తిరుగుతూ, దేశంలో పార్ట్‌టైం ప్రధానిగా పనిచేయలేదు కదా? బాధ్యతగల దేశ పౌరులం, మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి!
– డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad