Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిప్రహసనంగా అలాస్కా చర్చలు!

ప్రహసనంగా అలాస్కా చర్చలు!

- Advertisement -

‘కాపురం చేసే కళ కాళ్ల గోళ్ల దగ్గరే తెలుస్తుందన్నది’ ఒక సామెత. శుక్రవారం నాడు అమెరికాలోని అలాస్కా మిలిటరీ కేంద్రంలో డోనాల్డ్‌ ట్రంప్‌, వ్లదిమిర్‌ పుతిన్‌ భేటీ జరగనుంది. దాని గురించి ముందే వెలువడిన అభిప్రాయాలు, ఉక్రెయిన్‌ పోరులో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులను చూస్తే కాపురం సంగతి తర్వాత అసలు ముందు పెళ్లి జరిగితే కదా అన్న సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరించకపోతే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని ముందే ట్రంప్‌ బెదిరించాడంటే సంబంధం కలుపుకొనే ఉద్దేశ్యమే కాదు, కనీస దౌత్యమర్యాద కూడా లేదన్నది స్పష్టం. అలాస్కాలో జరిగేదేమీ ఉండదని అంతర్జాతీయ పరిణామాల పట్ల కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అవగతం అవుతుంది. ఇలాంటి ప్రహసనమే గతంలో కూడా జరిగింది.కాల్పుల విరమణ గురించి ట్రంప్‌ మాట్లాడినపుడు ఉక్రెయిన్‌ మీద మరిన్ని దాడులు జరిగాయి, ఇప్పుడు కూడా అదే పునరావృతమౌతోంది. పశ్చిమదేశాల కుట్ర, సమాచారం, కొందరు విద్రోహుల సహకారంతో రష్యా మిలిటరీ కేంద్రాలపై ఉక్రెయిన్‌ డ్రోన్లతో మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే.
శుక్రవారం నాటి సమావేశంలో చర్చించే అంశాల గురించి జెలెన్‌స్కీతో సహా ఐరోపా అగ్రనేతలందరూ డోనాల్డ్‌ ట్రంప్‌తో బుధవారం నాడు చర్చించి లక్ష్మణ రేఖలను దాటవద్దని హెచ్చరించారు. తమ అభ్యంతరాలు, పరిణామాలు, పర్యవసానాల గురించి కూడా స్పష్టం చేశారు.ఆ తర్వాతే కాల్పుల విరమణకు అంగీకరించకపోతే తీవ్ర పర్యవసానాలుంటాయని ట్రంప్‌ చెప్పాడు. అంతేకాదు ఉక్రెయిన్‌ విభజన లేదా ప్రస్తుతం పుతిన్‌ సేనల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను రష్యాకు బదిలీ చేయటం గురించి కూడా మాట్లాడేది లేదన్నాడు.అలాస్కా తర్వాత రెండో సమావేశంలో జెలెన్‌స్కీతో కలసి పుతిన్‌తో చర్చిస్తానంటూనే శుక్రవారం నాటి సమావేశంలో తనకు నచ్చే సమాధానం వస్తేనే రెండవది జరుగుతుందని కూడా ట్రంప్‌ చెప్పాడు. ఒక వదరుబోతు వ్యవహారం తప్ప నిజంగా ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరించాలని తీవ్రంగా పరిగణించే నేతలెవరూ ఇలాంటి వ్యాఖ్యలను ముందే చేయరు.
ఇలాంటి ముందస్తు షరతులు, బెదిరింపులు చేస్తే జరిగేదేమీ ఉండదని తెలిసినా రెండు పెద్దదేశాల నేతలు ఎందుకు భేటీ అవుతున్నట్లు అన్న సందేహం సామాన్యులకు కలుగుతుంది. నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నా అన్నట్లుగా ఎవరి గేమ్‌ వారు అడుతున్నారు. ప్రహసనం గాకపోతే శాంతిచర్చలు జరుపుదామని ట్రంప్‌ అంటే వద్దని పుతిన్‌ అంటాడా! గతంలో రష్యా విధించిన షరతుల నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గింది లేదు. తాను గద్దెనెక్కిన 24 గంటల్లోనే ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరిస్తానని ట్రంప్‌ చెప్పాడు. రెండువందల రోజులు కావస్తున్నది. ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నా అదోతీరు.అప్పటి నుంచి తాబేలు మాదిరి ఒక్కో ప్రాంతాన్ని రష్యన్‌ సేనలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూనే ఉన్నాయి. అమెరికా, ఐరోపాలోని ఆయుధ ఉత్పత్తి సంస్థలకు లాభాలు పెరుగుతున్నాయి తప్ప ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు ఇస్తున్న ఆయుధాలు పని చేయటం లేదు.మీకు కావాల్సినన్ని ఆయుధాలు ఇస్తాం, ఇం కా పోరాడండి అంటూ ముందుకు తోయటం తప్ప తాముగా రంగంలోకి దిగేది లేదని నాటో కూటమి దేశాలు స్పష్టం చేశాయి. అదే జరిగితే పరిణామాలు, పర్యవసానాలు వేరుగా ఉండేవంటే అర్ధం రష్యా ఓడిపోయి ఉండేదని కాదు.
ఉక్రెయిన్‌ సమస్యలో రష్యా గురించి నాటో కూటమి వేసిన అంచనాలు వేరు, జరిగింది వేరు, రష్యాది కూడా అదే పరిస్థితి అన్నది స్పష్టం. అయితే మొత్తం మీద చూసినపుడు ప్రపంచ రాజకీయాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. తటస్థ వైఖరిని తీసుకున్న భారత్‌, చైనా నాటో కూటమి ఆంక్షలను ధిక్కరించి చమురు కొనుగోలు చేయటం ద్వారా రష్యాను ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇది సామ్రాజ్యవాదులు, వాటి తొత్తు దేశాలకు తొలిదెబ్బ.తమ ప్రమేయం లేకుండా కుదిరే ఏ ఒప్పందాన్ని అంగీకరించేది లేదని ఉక్రెయిన్‌, దానికి మద్దతుగా ఉన్న ఐరోపా దేశాలూ ఇంతకు ముందు, ఇప్పుడూ పునశ్చరణ చేశాయి.వాటి వైఖరి తెలిసి ఉండి కూడా సంక్షోభాన్ని పరిష్కరిస్తానని రంగంలోకి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇప్పుడు ఇరకాటంలో ఉన్నట్లే. తమది పైచేయిగా ఉండే విధంగా పరిష్కారం కుదరాలని నాటో కూటమి, రష్యా రెండూ పట్టుదలగా ఉన్నాయి.ఒక పోరులో ఇరు జట్లూ గెలిచిన చరిత్ర గతం, వర్తమానంలో లేనిది భవిష్యత్‌లో ఉంటుందా! ఈ సంక్షోభం పశ్చిమదేశాల స్వయంకృతం. పరిష్కరించాల్సిన బాధ్యత కూడా వాటిమీదే ఉంటుంది. ఎలా అన్నదే ఆసక్తికరం!

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad