పణాజి: ఉత్తర గోవాలోని షిర్‌గావ్ గ్రామంలో శనివారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. శ్రీ లైరారు దేవి ఆలయంలో తెల్లవారు జామున 3.30గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, 65మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ వున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారి సంఖ్య కూడా ఇంకా ఎక్కువే వుండవచ్చని ఆందోళన చెందుతున్నారు. సమీప ఆస్పత్రుల్లో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఆలయంలో ఏటా జరిగే జాతరకు గోవా, మహారాష్ట్రల వ్యాప్తంగా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. శుక్రవారం ఈ జాతర ప్రారంభం కావడంతో తెల్లవారు జామునుండే భక్తులు పోటెత్తారు. రోజు గడుస్తున్న కొద్దీ భక్తుల తాకిడి పెరుగుతుండడంతో రద్దీని నియంత్రించడం పోలీసులకు కూడా కష్టసాధ్యమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితి మరీ తీవ్రమెందని పోలీసు అధికారి అరుణ్ దేశారు తెలిపారు. ఒక వ్యక్తి కిందపడి దొర్లుకుపోగా మరికొంతమంది వ్యక్తులు ఆ వ్యక్తిని తొక్కుకుంటూ వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలై వుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ జాతర కోసం ఆరు పోలీసు స్టేషన్ల నుండి వెయ్యి మందికి పైగా సిబ్బందిని మొహరించినట్లు చెప్పారు.
ఈ జాతర సందర్భంగా అగ్నిదివ్య పేరుతో నిప్పులపై నడిచే ఆచారం వుంది. ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఈసారే ఇలాంటి ప్రమాదం జరగడం విచారకరమని స్థానిక రిటైర్డ్ స్కూల్ టీచర్ రమేష్ (74) వ్యాఖ్యానించారు.
సీఎం విచారం
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ విషాద ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. గోవా జిల్లా ఆస్పత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయమందిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాటపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. దీనిపై నివేదికను కూడా వెల్లడిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ సంఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ తొక్కిసలాటకు ఎవరు బాధ్యులో తేల్చేందుకు, అవససరమైన చర్యలు తీసుకునేందుకు వెంటనే దర్యాప్తుకు ఆదేశించాలని ఎఐటియుసి ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రపతి సంతాపం
ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియచేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి కార్యాలయం వ్యక్తిగతంగా ఈ పరిస్థితులను పర్యవేక్షిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
గోవా ఆలయంలో తొక్కిసలాట
- Advertisement -
- Advertisement -