నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు మీద సుంకాలు పెంచుకుంటూ పోతూ ప్రపంచ దేశాలన్నీ బెదిరించేందుకు చేస్తున్న యత్నాలకు తాము తలొగ్గే ప్రసక్తే లేదని బ్రెజిల్ స్పష్టం చేసింది. అమెరికా టారీఫ్ పెంపుల కారణంగా నష్టాలు చవిచూస్తే దేశీయ ఉత్పత్తిదారులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లతో దెబ్బతిన్న ఎగుమతిదారులకు మద్దతుగా ‘సావరిన్ బ్రెజిల్’ పేరుతో 550 కోట్ల డాలర్ల మేర రుణాలను అందచేస్తోంది. అలాగే పన్ను చెల్లింపులకు విరామాలు ప్రకటించింది. ఈ ప్రత్యేక కార్యాచరణలో చిన్న తరహా వ్యాపారాలకు ముఖ్యంగా ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారస్తులకు ప్రాధాన్యతనిచ్చింది.
టారిఫ్‌లకు ప్రభావితమైన గ్రామీణ, వ్యవసాయ-పారిశ్రామిక రంగాల నుండి ప్రభుత్వ సేకరణలకు వెసులుబాటు కల్పించింది. ఎగుమతి హామీ వ్యవస్థలను ఆధునీకరించింది. ఉత్పత్తి వ్యవస్థలో చెల్లించిన పన్నులను తిరిగి వెనక్కి ఇచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరించింది.
సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొంటాం : లూలా
దేశంలో అమెరికా టారీఫ్‌ల పెంపు కారణంగా ఆర్థికంగా ఎదురౌతున్న సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొంటామని బ్రెజిల్ అధ్యక్షులు లూలా డసిల్వా ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టారిఫ్‌ల పెంపుపై ట్రంప్ వాదనలను తిరస్కరించారు. సంక్షోభం తలెత్తినపుడు తాము భయపడబోమని, ఆందోళన చెందబోమని, ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి బ్రెజిల్ ఎలాంటి ప్రతీకార చర్యలు చేపట్టబోదని లూలా చెప్పారు. సంబంధాలను దెబ్బతీసుకునే స్థాయిలో తాము ఎలాంటి చర్యలు చేపట్టాలనుకోవడం లేదని అన్నారు. ఈ టారిఫ్‌లు విధించడానికి ట్రంప్ పేర్కొంటున్న కారణాలను ఆయన తోసిపుచ్చారు. దేశంలో మానవ హక్కులను గౌరవించడం లేదని చేసిన ఆరోపణలను ఎంత మాత్రమూ ఆమోదించలేమన్నారు.
బ్రెజిల్ అధికారులపై అమెరికా వీసా ఆంక్షలు
బ్రెజిల్, ఆఫ్రికా, కరేబియన్ అధికారుల వీసాలను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. విదేశాలకు వైద్యులను పంపించే క్యూబా కార్యక్రమంతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణతో వారి వీసాలను అమెరికా రద్దు చేసింది. విదేశాలకు క్యూబా బలవంతంగా వైద్యులను పంపుతోందని అమెరికా నిందిస్తోంది. వీసా రద్దయిన బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇద్దరు అధికారుల్లో మొజార్ట్ జులియో తబోసా సేల్స్, ఆల్బర్టో క్లెయిమన్ ఉన్నారు. బ్రెజిల్‌కు చెందిన ‘మోర్ డాక్టర్స్’ కార్యక్రమంలో పనిచేస్తున్నందుకు అమెరికా వీరిపై వీసా ఆంక్షలు విధించింది.
క్యూబా ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందకుండా అక్కడి ప్రభుత్వం వైద్యులను బలవంతంగా విదేశాలకు పంపుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆరోపించారు. క్యూబా ఆరోగ్య కార్యక్రమానికి సహకరిస్తున్న ఆఫ్రికా దేశాలు, కరేబియన్ దేశమైన గ్రెనడా అధికారులపై కూడా ఆంక్షలు విధించామని వివరించారు. అయితే ఏయే ఆఫ్రికా దేశాల అధికారులపై ఆంక్షలు విధించిందీ ఆయన చెప్పలేదు. కాగా తన వైద్య కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు అమెరికా నిరాశావాదంతో కూడిన కారణాలు చెబుతోందని క్యూబా విమర్శించింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ విదేశాలకు వైద్య సహకారం కొనసాగుతుందని స్పష్టం చేసింది.