Sunday, May 4, 2025
Homeజాతీయంపాక్‌పై మరో అస్త్రం

పాక్‌పై మరో అస్త్రం

- Advertisement -

– వస్తువుల దిగుమతి, రవాణాపై నిషేధం
– మూడో దేశం ద్వారా రాకుండా ఆంక్షలు
– మెయిళ్లు, పార్శిళ్ల డెలివరీలపై నిషేధం
న్యూఢిల్లీ:
పాకిస్తాన్‌లో ఉత్పత్తి అవుతూ మన దేశానికి దిగుమతి అవుతున్న అన్ని రకాల వస్తువుల రవాణాపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అట్టారీ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టును (ఐసీపీ) ప్రభుత్వం గత నెలలోనే మూసవేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారత, పాకిస్తాన్‌ మధ్య జరుగుతున్న రూ.3,886 కోట్ల వాణిజ్యం ఈ చర్య ద్వారా నిలిచిపోతుందని అందరూ భావించారు. అయితే ఇతర దేశాల ద్వారా పాకిస్తాన్‌ తన వస్తువులను భారత్‌కు ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోకి పాక్‌ ఉత్పత్తులు, ఇతర వస్తువులు ప్రవేశించేందుకు ఎలాంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం తక్షణ నిషేధాన్ని విధించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు
‘ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ…పాకిస్తాన్‌లో ఉత్పత్తి అయ్యే వస్తువులు కానీ లేదా అక్కడి నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు కానీ…అవి స్వేచ్ఛగా దిగుమతి చేసుకోదగినవి అయినా కాకపోయినా… ఇతర విధాలుగా అనుమతించినా…తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ వాటన్నింటి పైనా తక్షణమే నిషేధం అమలులోకి వస్తుంది. దేశ ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆంక్షలను విధించడం జరిగింది. ఈ నిషేధానికి మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమవుతుంది’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో తెలిపింది.
తగ్గిపోతున్న ద్వైపాక్షిక వాణిజ్యం
2019లో పుల్వామాలో జరిగిన దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యం రూ.4,370.78 కోట్ల (2018-19) నుంచి 2,257.55 కోట్లకు (2022-23) తగ్గిపోయింది. అయితే 2023-24లో అది రూ.3,886.53 కోట్లకు పెరిగింది. సరుకు రవాణా కూడా 49,102 కన్‌సైన్‌మెంట్ల (2018-19) నుంచి 3,827 (2022-23)కు పడిపోయింది. డాలర్ల పరంగా చూసుకుంటే ద్వైపాక్షిక వాణిజ్యం గత ఐదు సంవత్సరాలలో ఏటా రెండు బిలియన్‌ డాలర్లు తగ్గిపోతోంది. మన వస్తు వ్యాపారం 430 బిలియన్‌ డాలర్లు కాగా పాక్‌ వస్తు వ్యాపారం సుమారు 100 బిలియన్‌ డాలర్లు. మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల అందజేతపై పనిచేస్తున్న అంతర్జాతీయ వాచ్‌డాగ్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‘గ్రే జాబితా’లోకి పాకిస్తాన్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్‌ కృషి చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. పాకిస్తాన్‌కు నిధులు, రుణాలు అందకుండా ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ వంటి ఆర్థిక సంస్థలతో కూడా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. పాక్‌ నుంచి వచ్చే మెయిళ్లు, పార్శిళ్ల డెలివరీలపై భారత్‌ నిలిపివేసింది.
దిగుమతులు ఇలా…
అట్టారీ సరిహద్దును మూసివేసిన తర్వాత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సింగపూర్‌, శ్రీలంక ద్వారా పాక్‌తో వాణిజ్యం కొనసాగించేందుకు భారత్‌కు అవకాశం ఏర్పడిందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సంస్థ చెబుతోంది. ఉదాహరణకు పాకిస్తాన్‌ ఖర్జూరాలు తృతీయ ప్రపంచ దేశాలు…ముఖ్యంగా యూఏఈ మీదుగా భారత ఓడరేవులకు చేరుకున్నాయి. మన దేశంతో యూఏఈకి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. రెండు దేశాల మధ్య గత ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అధికారిక డేటా ప్రకారం మన దేశం నుంచి సోయాబీన్‌, పౌల్ట్రీ ఆహారం, కూరగాయలు, ఎండుమిర్చి, ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌, ప్లాస్టిక్‌ నూలు వంటివి పాకిస్తాన్‌కు ఎగుమతి అవుతు న్నాయి. పాక్‌ నుంచి మన దేశం డ్రై ఫ్రూట్స్‌, ఖర్జూరాలు, జిప్సం, సిమెంట్‌, గాజు, కల్లుప్పు, మూలికలు దిగుమతి చేసుకుంటోంది. ‘పాక్‌ వస్తువులపై మనం ఆధారపడకూడదు. దీనివల్ల ఆర్థిక ప్రభావం తక్కువగా ఉంటుంది. అయితే పాకిస్తాన్‌కు ఇప్పటికీ మన వస్తువుల అవసరం ఉంది. కాబట్టి వేరే దేశాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా వాటిని పొందే అవకాశం ఉంది’ అని జీటీఆర్‌ఐ అధినేత శ్రీవాత్సవ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -