Sunday, May 4, 2025
Homeజాతీయంసహాయ శిబిరాల్లో దారుణ పరిస్థితులు

సహాయ శిబిరాల్లో దారుణ పరిస్థితులు

- Advertisement -

– ఇరుకైన గదుల్లో నిర్వాసితులు
– ప్రాథమిక వసతుల్లేక ఇక్కట్లు
– అపరిశుభ్ర వాతావరణంతో ఆరోగ్య సమస్యలు
– విద్యకు దూరమవుతున్న చిన్నారులు
– ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు
– స్థిరమైన ఆదాయంలేక ఎదురుచూపులు
– ఇది మణిపూర్‌లో వేలాది మంది దుస్థితి
మణిపూర్‌ జాతిహింసకు సంబంధించిన చేదు జ్ఞాపకాలు అక్కడి ప్రజలను ఇంకా వీడటం లేదు. ఇప్పటికే అనేక మంది ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరి, అల్లర్లను నియంత్రించటంలో ప్రభుత్వాల వైఫల్యం వారిని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ముఖ్యంగా, అక్కడి సహాయ శిబిరాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇండ్ల నుంచి వెళ్లగొట్టబడిన మెయిటీ కుటుంబాలు ఇప్పుడు బిష్ణుపూర్‌లోని మోయిరాంగ్‌ పట్టణంలోని ఒక కళాశాలలోని అత్యంత రద్దీగా ఉండే హాళ్లలో ఉంటున్నాయి.
ఇంఫాల్‌:
ఇక్కడ 527 మంది నిరాశ్రయులైన ప్రజలు ఇరుకైన గదుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో నివసిస్తున్నారు. వారికి 15 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ప్రాథమిక సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నవారు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వారికి స్థిరమైన ఆదాయం కరువైంది. దీంతో ప్రభుత్వ సహాయం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఇక్కడి నివాసితులకు ఏర్పడింది.
సహాయ శిబిరాల్లోని కఠిన పరిస్థితులు షాక్‌ను కలిగిస్తున్నాయి. చాలా మంది ఆత్మహత్యలు, వైద్య అత్యవసర పరిస్థితుల్లో మరణించారు. ఇంత జరిగినా.. ఈ కేసులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక డేటానూ విడుదల చేయలేదు. ”నా పిల్లలకు ఆహారం లేదు. నాకు సంపాదన లేదు. మా జీవితాలను చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గం లేదని నేను భావించాను” అని సహాయ శిబిరంలో నివసిస్తున్న లాయిటోంగ్‌ బామ్‌ నానావో వాపోయాడు. ఇది కేవలం ఒక సహాయ శిబిరం లేదా ఒక వ్యక్తి కథ కాదు. మణిపూర్‌లోని ప్రతి నిరాశ్రయుడైన వ్యక్తి దీనగాధను తెలియజేస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ.. రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా మునుపటి స్థాయికి రాలేదు. దీంతో సహాయ శిబిరాల్లో ఉంటున్న ప్రజలు తీవ్ర నిరాశలో ఉంటున్నారు. ”నేను దేశంలోని అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన రాహుల్‌ గాంధీని కలిశాను. త్వరలోనే పరిస్థితులు బాగుపడతాయని ఆయన నాకు చెప్పారు. నా కుటుంబ పరిస్థితి ఏమీ మారలేదు” అని కాజల్‌ అనే వ్యక్తి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. ”నేను 2023లో నా బి.ఎ ఫస్ట్‌ సెమిస్టర్‌లో ఉన్నపుడు రాహుల్‌ను కలిశాను. నా కష్టాల గురించి చెప్పాను. చురాచాంద్‌పూర్‌ పరిస్థితిపై శ్రద్ధ వహించాలని కూడా నేను ఆయనను అభ్యర్థించాను” అని ఆమె వివరించారు. కాజల్‌ వివరించిన బాధ కేవలం వ్యక్తిగతమైనది కాదు. ఇది మణిపూర్‌లో జరుగుతున్న పెద్ద విషాదాన్ని ప్రతిబింబిస్తుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిపాలన వంటి ముఖ్యమైన సేవలు ఇంఫాల్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. దీంతో కొండ ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ సేవలకు దూరమవుతున్నారు. విద్యా, వైద్య సంరక్షణ లేకపోవటంతో చాలా మంది సహాయ శిబిరాలకే పరిమితమవుతున్నారు.
హింసతో అట్టుడికిన మణిపూర్‌ను ప్రధాని స్థాయిలో మోడీ సందర్శించక పోవటం గమనార్హం. రాహుల్‌ గాంధీ ఈ రాష్ట్రాన్ని తరచూ సందర్శించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ ఏడాది మార్చి 22న రాష్ట్రంలో పర్యటించారు. జస్టిస్‌ బి.ఆర్‌ గవారు నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ప్రతినిధి బృందం మణిపూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించింది. తాత్కాలిక ఇండ్లను నిర్మిస్తా మనీ, శాంతి పునరుద్ధరణ తర్వాత సొంత గ్రామాలకు తరలిస్తామని జూన్‌, 2023లో మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. దాదాపు రెండేండ్లు గడిచినా.. ఆ హామీ నెరవేరలేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
మారని పరిస్థితులు
రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ మణిపూర్‌లో పరిస్థితులు పెద్దగా మారలేదని స్థానికులు చెప్తున్నారు. పైగా.. ఈ పాలన ప్రకటన తర్వాత మరణాల సంఖ్య ఇంకా పెరిగిందని వివరిస్తున్నారు. మణిపూర్‌లో 2023, మే 3న జాతి హింస చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి కొనసాగుతున్న హింసలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అతలాకుతలమైన రాష్ట్రాన్ని మోడీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సందర్శించకపోవటం గమనార్హం. 60వేల మందికి పైగా ప్రజలు ఇప్పుడు సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. వారి గ్రామాలు చాలా వరకు బూడిదయ్యాయి. కొందరి ఇండ్లు చట్ట విరుద్ధంగా ఆక్రమించబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -