– 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగించాలి
– ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లకు చట్టం చేయాలి : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కులగణన ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనను సీపీఐ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని, తెలంగాణలో సమర్ధించిందన్నారు. రిజర్వేషన్ ఫలాలు అర్హులకు అందాలంటే జనగణనలో కులగణన అవసరమ న్నారు. జనగణన నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉందని, కులగణన ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. ఇందుకనుగుణంగా విధాన పరమైన నిర్ణయాలు ఎప్పుడూ తీసుకుంటారనే దానిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని కేంద్రం తొలగించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రయివేట్ పరం చేస్తోందని విమర్శించారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినప్పటికీ సమాధానం చెప్పడం లేదన్నారు. పహల్గాం ఉగ్రదాడిని సీపీఐ ఖండి స్తోందని, బాధిత కుటుంబాలకు కేంద్రం న్యాయం చేయా లని డిమాండ్ చేశారు. నిఘా, భద్రతా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించడం, కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం తో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు లేవ న్నారు. మోడీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి రాష్ట్ర హౌదా పున రుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేస్తోందని విమ ర్శించారు. దేశవ్యాప్తంగా మే 20న కార్మిక సంఘాల సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తోందన్నారు. చర్చలతో పాక్, చైనా, భారత్ సమస్యలు పరిష్కరించుకోవాలని, పక్కపక్క దేశాలు గొడవలు పడటం సరికాదని సూచించారు. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రజల ఆశలను నీరు గార్చిన మోడీ : రామకృష్ణ
రాజధాని అమరావతి నిర్మాణ పనులు పున్ణప్రారంభిం చిన ప్రధాని మోడీ ప్రజల ఆశలను నీరుగార్చారని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ విమర్శించారు. 2015లో ఇలానే వచ్చి మట్టి, నీరు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఎలాంటి ఆర్థిక సహకారం ప్రకటించలేదన్నారు. గ్రాంట్ ఇస్తామని ప్రకటించి, అప్పులు తెస్తున్నారని విమర్శించారు. రూ.31 వేల కోట్లు అప్పు తెచ్చారని, మరో రూ. 30 వేల కోట్లు అప్పు తెస్తున్నట్లు సమాచారమని తెలిపారు. అమరావతికి రూ.1,500 కోట్లు మాత్రమే గ్రాంట్‌గా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి నిధుల విషయంలో పునరాలోచన చేయాలని, నిర్మాణం వేగంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వెనుకుబడిన ప్రాంతా లపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. వెనుక బడిన జిల్లాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అసమానతలు పెరుగుతున్నాయన్నారు. అమరావతి, పోలవరం కోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించాలని సూచించారు.
కులగణన ఎప్పటికి పూర్తి చేస్తారు?
- Advertisement -
- Advertisement -