నవతెలంగాణ-హైదారాబాద్: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కన్ఫెషన్ రిపోర్ట్ ద్వారా కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ కన్ఫెషన్ రిపోర్టు ప్రకారం డాక్టర్ నమ్రత ఏం చెప్పిందంటే … ” 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించాను. 2007లో సికింద్రాబాద్లో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించాను. ఆ తర్వాత వైజాగ్‌లోనూ మరో ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించాను. నా రెండో కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా ఉంటూ సహకరించేవాడు. ” డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలను వసూలు చేశారు. ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనేవారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులను ఆశచూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకునేవారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లలను కొనుగోలు చేశారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టినవారిగా నమ్మించారు. పై విషయాలతో పాటు.. పలు పోలీసు స్టేషన్లలో తనపై కేసులు నమోదైనట్లు నమ్రత ఒప్పుకున్నారు.