– పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి
– చలో బస్ భవన్ కార్యక్రమం విజయ వంతం
నవతెలంగాణ – ముషీరాబాద్‌ఆర్టీసీ
కార్మికులను ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల బస్ భవన్ వద్ద జరిగిన సమావేశంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులపై రోజు రోజుకూ పెరుగుతున్న పని భారంతోపాటు సమస్యలపైనా పలు దఫాలుగా మెమొరాండం ఇచ్చినప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదన్నారు. 2021 వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
మాస్టర్ స్కేల్ ఇవ్వాలన్నారు. పే స్కేల్ జాప్యమైతే 25 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను రద్దుచేసి ట్రేడ్ యూనియన్లను అనుమతించాలన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్‌మెంట్ డేను వెంటనే ప్రకటించాలని కోరారు. కార్మికులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. విద్యుత్ బస్సుల పథకంలో మార్పులు చేసి ఆర్టీసీనే కొనుగోలు చేసేందుకు సబ్సిడీ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పంపాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలన్నారు. కండక్టర్లపై చిన్నచిన్న ఆరోపణలకు చర్యలు తీసుకుంటున్నారని, వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నదని తెలిపారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు అబ్రహం, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ డి.గోపాల్, సాయి రెడ్డి, వినాయక్ రెడ్డి, విజయబాబు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES