ప్రియమైన వేణు గీతికకు..
ఎలా ఉన్నావు నాన్నా.. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నా గురించి ఆలోచించి బెంగ పెట్టుకోకు. రోజు రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నావు కదా! ఫోన్ అంటే గుర్తుకు వచ్చింది. ఈ రోజున నీకు ఫోన్లు మాట్లాడే వాళ్ళ గురించి చెప్తాను. మా చిన్నప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంటే, వాళ్ళు చాలా ధనవంతులు అనుకునే వాళ్ళం. పది ఇళ్లుంటే అందులో ఒకరి ఇంట్లో మాత్రమే ఫోన్ ఉండేది. అలాంటిది ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. చిన్న పిల్లల దగ్గర నుండి వృద్దుల వరకు వాడేస్తున్నారు.
టెక్నాలజీ పెరిగి, అందరి చేతుల్లోకి ఫోన్ రావడం కొన్ని విధాలా మంచిదే అయితే దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడమే అనేక సమస్యలకు కారణం. కొందరు బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ గంటలకొద్ది మాట్లాడుతూ ఉంటారు. కొందరు బహిరంగంగా స్నేహితులతో, బంధువులతో అయితే వాళ్ళు కొనుక్కున్న నగలు, వెండి వస్తువులు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడటం వల్ల చుట్టూ ఉన్నవారికి మీరు మాట్లాడే విషయాలు అన్నీ తెలుస్తాయి.
అందులో ఎవరు ఎలాంటి వారో తెలియదు. మిమ్మల్ని వెంబడించి రావడం కష్టమైన పని కాదు. మీ కదలికలను గమనించి మీరు లేని సమయంలో దొంగతనాలకు, హత్యలకు పాల్పడవచ్చు. ఎప్పుడైన సరే మీ వ్యక్తి గత విషయాలు మాట్లెడేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం మంచిది. ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఎంత ఉన్నా పరిసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడాలి. లేదా నేను ఇంట్లో లేను, ఇంటికి వెళ్లి మాట్లాడతా అని చెప్పాలి. బహిరంగ ప్రదేశాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, మనం ఉండేది ఈ ప్రాంతంలో కాదు కదా, ఏమౌతుందిలే అనే ధోరణి అతి ప్రమాదకరం. ఏదైనా జరిగిన తర్వాత బాధపడేకంటే ముందే జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఇటువంటి వారిని నువ్వు రోజూ చూస్తూనే ఉంటున్నావు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి నాన్న వుంటాను..
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి