ముగిసిన పుతిన్ – ట్రంప్ భేటీ
చర్చలపై ఇరువురు నేతల సంతృప్తి
మాస్కోలో తదుపరి చర్చలు
యాంకరేజ్ : అలాస్కా రాష్ట్రంలోని యాంకరేజ్ నగరంలో శుక్రవారం అమెరికా, రష్యా అధినేతలు ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది. నగరంలోని సైనిక స్థావరంలో జరిగిన ఈ సమావేశం కోసం దాదాపు దశాబ్ద కాలంలో మొదటిసారిగా రష్యా అధినేత అమెరికాలో పర్యటించారు. 2021 తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు ముఖాముఖి సమావేశం కావడం కూడా ఇదే తొలిసారి. తొలుత ముఖాముఖి అనుకున్నారు కానీ చివరకు ఇరు పక్షాలవైపు ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. అమెరికా వైపు ట్రంప్‌తో పాటూ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అధ్యక్షుడి దూత స్టీవ్ విట్కాఫ్‌లు పాల్గొనగా రష్యా వైపు పుతిన్‌తో పాటు విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్, అధ్యక్షుడి సలహాదారు యూరి యుష్‌కొవ్‌లు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఇరువురు నేతలు సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, అనేక అంశాలపై అంగీకారం కుదిరింది. గొప్ప పురోగతే సాధించాం, కానీ లాంఛనంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని చెప్పారు. పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ భద్రతకు హామీ కల్పించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఇప్పుడు కుదిరిన అవగాహన శాంతి వైపుగా మార్గం వేసేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఘర్షణల నుండి చర్చలకు వచ్చామన్నారు. ఏ సమస్యకైనా పరిష్కారమనేది నిలకడగా, స్థిరంగా వుండాలి, సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించేదిగా వుండాలని అన్నారు. శాంతి ప్రక్రియను దెబ్బతీయడాన్ని ఆపాలని కీవ్‌ను కోరారు.
ఇరువురు నేతలు దాదాపు 12 నిముషాల పాటు విలేకర్ల ముందు నిలుచుని మాట్లాడారు. పురోగతి సాధించినట్లు ఇరువురు నేతలు నొక్కి చెప్పారు, కానీ నిర్దిష్టంగా వివరాలు వెల్లడించలేదు. కాగా చర్చలు సానుకూలంగా సాగాయని తెలిపారు. మాస్కోలో తదుపరి దఫా చర్చలు జరిగే అవకాశం వుంది.
”జరుగుతున్నదంతా మాకు పెద్ద విషాదమే, భయంకరమైన గాయమే”, దీనికి స్వస్తి పలికేందుకు రష్యా నిజాయితీగా ఆసక్తితో వుందని పుతిన్ చెప్పారు. అయితే ఈ ఘర్షణలకు గల ప్రాధమిక కారణాలను పరిష్కరించాల్సిన అవసరమైతే వుందని ఆయన నొక్కి చెప్పారు. కానీ, సమస్యలను సృష్టించొద్దని ఉక్రెయిన్‌ను, యురోపియన్ దేశాలను పుతిన్ హెచ్చరించారు.
ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికే కాదు, రష్యా, అమెరికాల మధ్య వ్యాపార తరహా, ఆచరణాత్మక సంబంధాలు పునరుద్ధరించడానికి కూడా ఈ సమావేశం ఒక నాందీ ప్రస్తావనగా వుండగలదని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్యం, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం,రోదసీ అన్వేషణ, ఆర్కిటిక్ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారానికి మంచి అవకాశాలు వున్నాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, యురోపియన్ నేతలను కలవనున్నట్లు ట్రంప్ చెప్పారు.
విలేకర్లు ప్రశ్నలు అడగకుండానే నేతలు చెప్పిన వెంటనే పత్రికా సమావేశం ముగిసింది. ఇరువురు నేతలు సమగ్రంగా చర్చల ఫలితాల సారాంశాన్ని చెప్పినందున ఇక మీడియా ప్రశ్నలు అడగడం అనవసరమని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ చెప్పారు. దాదాపు మూడుగంటల పాటు చర్చలు సాగాయి.అనంతరం ఇరువురు నేతలు అలాస్కా నుండి బయలుదేరారు.
ఇక జెలెన్‌స్కీదే బాధ్యత
ఈ సమావేశం ముగిసిన వెంటనే ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఇక కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాల్సింది జెలెన్‌స్కీనే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భూ ఆక్రమణలు, భద్రతా హామీలు వంటి అంశాలు పుతిన్‌తో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయని సూచనప్రాయంగా చెప్పారు. త్వరలోనే పుతిన్, జెలెన్‌స్కీ, తాను సమావేశమవుతామని చెప్పారు.
ఒప్పందం లేకుండానే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES