- కృష్ణాకాంత్ పార్కు చెరువుకు మళ్లించడంపై అధ్యయనం
- క్షేత్రస్థాయిలో అవకాశాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
- నవతెలంగాణ-హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్, మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రంకు లైను ఏర్పాటు చేయడంతో పాటు.. తాత్కాలిక ఉపశమనానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం అమీర్‌పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. అనంతరం కృష్ణాకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 10, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల నుంచి కృష్ణాకాంత్ పార్కు మీదుగా పారే వరద కాలువలను పరిశీలించారు. కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువును కూడా తనిఖీ చేశారు. పై నుంచి భారీఎత్తున వస్తున్న వరదను కృష్ణాకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలా వరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చుననే అభిప్రాయానికి హైడ్రా కమిషనర్ వచ్చారు.
చెరువుకు మళ్లించి వరద కట్టడి..?
పై ప్రాంతాల నుంచి వచ్చే వరదను కృష్ణాకాంత్ పార్కులో ఉన్న చెరువుకు మళ్లించి కొంతమేర ఉధృతిని తగ్గించవచ్చు అనే అంశంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. 7 ఎకరాల మేర పార్కులో చెరువుంది. ఆ చెరువును 12 ఎకరాల వరకూ విస్తరించడానికి వీలుంది. ఇలా 120 మిలియన్ లీటర్ల నీటిని కొన్ని గంటలు హోల్డ్ చేసి.. వర్షం తగ్గిన తర్వాత కిందకు వదిలితే వరద ఉధృతిని కొంతవరకు తగ్గుతుందని భావించారు. ప్రస్తుతం కృష్ణాకాంత్ పార్కులోని చెరువులోకి నీరు వెళ్లకుండా.. నేరుగా మధురానగర్ మీదుగా అమీర్‌పేటకు వచ్చి చేరడంతో మెట్రో స్టేషన్ కింద భారీ మొత్తంలో వరద నీరు నిలిచిపోతోందని అభిప్రాయపడ్డారు. కృష్ణాకాంత్ పార్కులోని చెరువు నుంచి మధురానగర్ మీదుగా అమీర్‌పేట మెట్రో స్టేషన్ వరకూ 1100 మీటర్ల బాక్సు డ్రైన్ ఉంది. అమీర్‌పేట వద్ద భూమి సమాంతరంగా ఉండడంతో పై నుంచి భారీమొత్తంలో వచ్చిన వరద కిందకు వెళ్లడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని హైడ్రా అధికారులు కమిషనర్‌కు తెలిపారు. దీనికి తోడు పై నుంచి వచ్చిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా వరద ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
జీపీఆర్‌ఎస్ ఆటంకాలను గుర్తించాలి..
అమీర్‌పేట-సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారిని వరద నీరు దాటేందుకు వేసిన పైపు లైన్లలో ఉన్న ఆటంకాలను గుర్తించేందుకు జీపీఆర్ ఎస్ (Ground Penetrating Radar survey) సర్వే చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు సూచించారు. దీని ద్వరా పైపులైన్లలో పేరుకుపోయిన పూడికను గుర్తించడం జరుగుతుందన్నారు. తొలగించడానికి వీలు కాని పక్షంలో బాక్సు డ్రైన్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించవచ్చునన్నారు. అప్పటి వరకూ మెట్రో స్టేషన్ కింద ఉన్న పైపులైన్లలోంచి వరద నీరు సాఫీగా సాగేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని హైడ్రా కమిషనర్ సూచించారు. సారథి స్టూడియో పక్కనుంచి, మధురానగర్ మీదుగా వచ్చే వరద కాలువలు రోడ్డు దాటినప్పుడు తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తే ఇబ్బందులుండవని అధికారులు తెలిపారు. ఇందుకు దీర్ఘకాలిక ప్రణాళిక.. తాత్కాలిక ఉపశమనం కల్పించడంపై దృష్టి పెట్టాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు.
